శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: సోమవారం, 12 జూన్ 2017 (21:56 IST)

రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు... ఒక పంట కాకపోతే మరొకటి... మంత్రి సోమిరెడ్డి

పంటలు పోయాయనో.. అప్పుల పాలయ్యామనో ఆత్మహత్యలు చేసుకోవద్దని.. రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్ధిక ఇబ్బందులనేవి అన్ని రంగాల్లోనూ ఉన్నాయని.. ఈ కారణ

పంటలు పోయాయనో.. అప్పుల పాలయ్యామనో ఆత్మహత్యలు చేసుకోవద్దని.. రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్ధిక ఇబ్బందులనేవి అన్ని రంగాల్లోనూ ఉన్నాయని.. ఈ కారణంతో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం మంచిది కాదన్నారు. అప్పుల పాలయ్యామని రాష్ట్రంలోని రైతులెవరూ భయపడాల్సిన అవసరం లేదని.. ఒక పంట కాకపోతే.. మరో పంటకైనా రైతుల్ని గట్టెక్కించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. 
 
వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్న తమ ప్రభుత్వం.. రైతాంగానికి అండగా ఉంటుందని.. ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా ఆదుకుంటుందన్నారు. అవసరమైతే.. వ్యవసాయరంగానికి కేటాయించిన బడ్జెట్ నిధులకు మించి ఖర్చు చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వ్యవసాయ రంగంలో దేశం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తోందన్నారు. ధనిక రాష్ట్రాలు కూడా అమలు చేయలేని రుణమాఫీని అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనన్నారు. 
 
రూ.3,350 కోట్ల విలువైన ఉచిత విద్యుత్ ను రైతులకిస్తున్నామని.., లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు, ఆపైన ఎంత కావాలన్నా.. పావలా వడ్డీకే రుణాలిస్తున్నామని మంత్రి సోమిరెడ్డి తెలిపారు. ఏపీ కన్నా ధనిక రాష్ట్రమైన మహారాష్ట్ర ఇప్పటి వరకు ఉచిత విద్యుత్ ఇవ్వలేకపోయిందని, మధ్యప్రదేశ్ కొద్ది శాతం రాయితీతో మాత్రమే విద్యుత్ అందజేస్తోందని అన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లలో ఉద్యమాలు జరిగి కాల్పుల్లో రైతులు చనిపోతే కానీ.. రుణమాఫీ ప్రకటన చేయలేకపోయారని.. ఆయా రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తితోనే రుణమాఫీ అమలు చేయడానికి సిద్ధమవుతున్నాయని అన్నారు.
 
ఉద్యానరంగానికి రూ.1170 కోట్లు
రాష్ట్ర రైతులకు 120 కోట్ల రూపాయల విలువైన సూక్ష్మ పోషకాలను ఉచితంగా అందివ్వాలని నిర్ణయించామని మంత్రి సోమిరెడ్డి తెలిపారు. సాధారణంగా రాష్ట్రంలో ఆరు లక్షల హెక్టార్లలో పత్తి సాగు జరుగుతుందని, రేటు పడిపోయి రైతులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశ్యంతో.. మిగిలిన పంటలసాగు వైపు ప్రోత్సహించాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఇలా ఇతర పంటలు సాగు చేయాలనుకునే పత్తి రైతులకు పురుగు మందులు, కలుపు నివారణ మందులకు ఇచ్చే రాయితీని 33 నుంచి 75 శాతానికి పెంచాలని నిర్ణయించినట్టు తెలిపారు. 
 
ఇలా లక్షన్నర హెక్టార్ల వరకు ఈ రాయితీలను అందజేస్తామన్నారు. 20 మీటర్ల లోతు వరకు జలవనరులు అందుబాటులో లేని రైతులకు సూక్ష్మ నీటి పారుదల వ్యవస్థ కింద 90 శాతం రాయితీతో పరికరాలు అందజేయనున్నట్టు చెప్పారు. ఉద్యానవన రంగం అభివృద్ధి కోసం ఈ ఏడాది 1170 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టు వివరించారు. వ్యవసాయ యంత్ర పరికరాల కోసం ఇచ్చే రాయితీని 407 కోట్ల రూపాయలకు పెంచినట్టు తెలిపారు. అలాగే రైతు రథం పథకం కింద ఒక్కో జిల్లాకు సగటున 500 ట్రాక్టర్ల చొప్పున మొత్తం 6,600 ట్రాక్టర్లు అందజేయాలని నిర్ణయించామన్నారు. 
 
ఈ పథకం కింద ఒక్కో రైతుకు రెండు లక్షల రూపాయలకు పైగా రాయితీ దక్కుతుందన్నారు. భూసార పరీక్షలు చేయించి.. రైతులకు ఇప్పటికే సాయిల్ హెల్త్ కార్డ్స్ అందజేశామని, అలాగే ఇక్రిశాట్ సహకారం నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నామని, ప్లాంటిక్స్ సహకారంతో పంటల చీడపీడల నివారణకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులు తెలుసుకునే ఏర్పాట్లు చేశామని మంత్రి సోమిరెడ్డి వివరించారు. 
 
టెక్నాలజీని వినియోగించుకుంటే రైతులకు లాభం జరుగుతుందన్న ఉద్దేశ్యంతో.. మన దేశంలోనే కాకుండా.. విదేశాల్లో సైతం ఎలాంటి పద్దతులు ఉపయోగిస్తున్నారో.. వాటిని పరిశీలించి.. మన రాష్ట్రంలో అమలు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. మిర్చి రేటు పడిపోతే.. అదనపు ధర ఇచ్చి కొనుగోలు చేయడంతో పాటు, మూడు లక్షల క్వింటాళ్ల పసుపు కొనుగోలు చేశామని, కందులు, మినుము కూడా కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటున్నామన్నారు. 
 
రైతులకు ఎక్కడన్నా ఇబ్బంది ఉందీ అంటే.. తక్షణమే స్పందించి ఆదుకోడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, రైతుల హృదయాలను తాకేలా తమ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో దిగుబడులు తక్కువగా ఉంటున్నాయని.. ఆ ప్రాంతంలో దిగుబడులు పెంచేందుకు.. ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాల్లో గిరిజన రైతులకు ఎలాంటి ప్రోత్సాహకాలివ్వాలన్న అంశంపై త్వరలో అధికార యంత్రాంగంతో సమాలోచనలు జరపబోతున్నామన్నారు. ప్రకృతి సేద్యంలో అత్యధిక ఉత్పత్తి సాధిస్తున్న రాష్ట్రంగా దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉందన్నారు. 
 
నకిలీ విత్తనాలు విక్రయించే వ్యాపారులు, సంస్థలపై పీడీ యాక్ట్ అమలు చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార యంత్రాంగానికి ఆదేశించినట్టు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. రైతులే ముందు అన్న లక్ష్యం మేరకు రైతు ప్రయోజనాల కోసం తమ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. కౌలు రైతుల కోసం చట్టం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అలాగే రైతులకు పూర్తిస్థాయి పంటల బీమా కల్పించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 
 
ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహించి, 1680 కోట్ల రూపాయల ఇన్‌పుట్ సబ్సిడీని రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసేందుకు చర్యలు తీసుకోబోతున్నామని చెప్పారు. అలాగే వర్షపాతం తక్కువగా ఉండే అనంతపురం జిల్లాలో అడిగిన వాళ్లందరికీ వంద శాతం రాయితీతో సూక్ష్మ నీటి పారుదల వ్యవస్థ కింద పరికరాలు అందజేయాలని నిర్ణయించామన్నారు.