విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 33 విత్తనశుద్ధి, విత్తనాలను నిల్వ చేసేందుకు గోదాములను మంజూరు చేసింది. వాటికి సంబంధించి జిల్లాల వారీగా ఏ విధంగా పనులు జరుగుతున్నాయనే అంశంపై సమీక్ష సమావేశాన్నినిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్ పర్సను పేర్నాటి హేమ సుస్మిత ఈ సందర్భంగా మాట్లాడుతూ, తమ సంస్థకు సంబంధించి రైతులకు ఖరీఫ్, రబీ సీజన్లలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యమైన విత్తనాలను అందించాల్సిన బాధ్యత అందరి మీద ఉందని తెలిపారు. అదే విధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా మన సంస్థకు సొంత భవనాలు ఉంటే బాగుంటుందని ఈ సమావేశంలో చర్చించారు. సేంద్రియ వ్యవసాయానికి ముఖ్యమంత్రి పెద్దపీట వేయాలని ఆలోచనతో ఉన్నారు కాబట్టి, విత్తనాభివృద్ధి సంస్థ పూర్తి బాధ్యత తీసుకొని, రైతులను చైతన్యపరిచి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దామన్నారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం "సీడ్ ప్రొడక్షన్ విలేజెస్" అనే పేరుతో దాదాపుగా 1000 గ్రామాలను గుర్తించి, రైతులకు మినిమమ్ సెల్లింగ్ ప్రైస్ ఏర్పాటు చేసి, రైతులు ఎక్కడ కూడా నష్ట పోకుండా విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా ముందుకు నడిపిస్తోందన్నారు. రాష్ట్రంలో 33 ప్రాసెసింగ్ యూనిట్లే కాకుండా, ఇంకొన్ని విత్తన నిల్వ, శుద్ధి కర్మాగారాలు కావాలని ఈ సమావేశంలో కోరారు. ఈ సమావేశంలో ఉన్నతాధికారులు, మార్కెటింగ్ మేనేజర్, ఫైనాన్స్ మేనేజర్, ఇంజినీరింగ్ విభాగం, అకౌంట్స్ మేనేజర్, అన్ని జిల్లాల మేనేజర్లు పాల్గొన్నారు.