గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 15 మార్చి 2020 (09:02 IST)

ఏపీ అప్రమత్తం...కరోనా కోసం విదేశీయులపై డేగకన్ను

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను దరి చేరనీయకుండా వుండేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలకు దిగింది. ఎక్కడికక్కడ అప్రమత్తమైంది. కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ‘మినీ హెల్త్‌ ఎమర్జెన్సీ’ ప్రకటించిన సర్కారు... ఫిబ్రవరి 10వ తేదీ తర్వాత వివిధ దేశాల నుంచి వచ్చిన వారికి ‘క్వారంటైన్‌’ విధించింది. ఇప్పటిదాకా 6,644 మందిని గుర్తించి... 14రోజుల పాటు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 10తర్వాత విదేశాల నుంచి వచ్చినవారి వివరాలను మూడురోజుల నుంచి సేకరిస్తున్నారు.

ఇప్పటి వరకూ కోటి ఇళ్లలో సర్వే నిర్వహించి 6,644 మంది వచ్చినట్లు తేల్చారు. వీరిలో 149 మందిని అనుమానితులుగా గుర్తించారు. మరో 40లక్షల ఇళ్ల సర్వే ఆదివారం పూర్తికానుంది. దీంతో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఆశా వర్కర్లను ఎప్పటికప్పుడు వారి ఇళ్లకు పంపించి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. విజయవాడ నుంచి కూడా ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నారు.

దీనికోసం రెండు జిల్లాలకు కలిపి ఒక అధికారిని నియమించారు. ఆ అధికారి నిరంతరం ఫోన్లలో వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. అనుమానం వచ్చినవారిని వెంటనే స్థానిక ఆస్పత్రుల్లోని ఐసోలేషన్‌ వార్డులకు తరలిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్య కడప, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అధికంగా ఉన్నట్లు గుర్తించారు. కరోనా భయంతో విదేశాల నుంచి వచ్చిన 400మంది గుంటూరు జిల్లావాసులను ప్రభుత్వం గృహ నిర్బంధంలో ఉంచింది.

వీరిలో గుంటూరు అర్బన్‌ ప్రాంతంలో 201మంది, జిల్లాలోని వివిధ పట్టణాలు, గ్రామాలకు చెందినవారు 199మంది ఉన్నారు. వీరి ఇళ్లకు వెళ్లిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది 14రోజుల పాటు బయటకు రావద్దని ఆదేశించారు. జ్వరం, దగ్గు, జలుబు, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలన్నారు. వీరిలో అత్యధికులు ఇటలీ, దక్షిణ కొరియా, ఇరాన్‌, సింగపూర్‌ తదితర దేశాలనుంచి గతవారంలో వచ్చినవారే. కేంద్ర , రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు ఆ వివరాలను డీఎంహెచ్‌వో కార్యాలయానికి పంపడటంతో.. అందరినీ హోం క్వారంటైన్‌లో ఉంచారు.

వ్యాధి లక్షణాలు లేకపోవడంతో కేవలం కోవిడ్‌-19 అనుమానితులుగా మాత్రమే భావించి గృహ నిర్భందంలో ఉంచారు. ఆరోగ్య సిబ్బంది రోజూ ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్య స్థితి పరిశీలిస్తున్నారు. కాగా, గృహ నిర్బంధంలో ఉన్న కొందరు బయట తిరుగుతున్నారంటూ ఆరోగ్యశాఖకు ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, విదేశాల నుంచి వచ్చినవారు క్వారంటైన్‌ కాలం ముగిసే వరకు బయట తిరగొద్దని డీఎంహెచ్‌వో యాస్మిన్‌ ఆదేశించారు.

శనివారం నుంచి డీఎంహెచ్‌వోలకు ప్రభుత్వం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారాలు ఇచ్చిందని, బయటకు వచ్చినవారిని అరెస్ట్‌ చేయించి నిర్భందంగా ప్రభుత్వాస్పత్రుల్లోని ఐసోలేషన్‌ వార్డులకు తరలిస్తామని హెచ్చరించారు. కరోనా తీవ్రత నేపథ్యంలో పెళ్లిళ్లు, వేడుకలు, ఊరేగింపులకు ప్రజలు దూరంగా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈనెల 30వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. తెనాలికి చెందిన ఒక యువకుడిలో అనుమానిత లక్షణాలు ఉండటంతో నమూనాలు ల్యాబ్‌కు పంపగా కరోనా నెగటివ్‌ అని తేలింది. 

కరోనా భయంతో విదేశాలు వదిలి స్వస్థలాలకు వస్తున్న ప్రవాసాంధ్రులను చూసి ఇరుగు, పొరుగు ఆందోళనకు గురవుతున్నారు. వీరిద్వారా వైరస్‌ వ్యాపించే ప్రమాదం ఉందనే భయంతో ఆరోగ్యశాఖకు, మీడియా కార్యాలయాలకు ఫోన్‌ చేసి సమాచారం ఇస్తున్నారు. కొందరు ఎన్నారైలు, ఇటీవల విదేశాలకు వెళ్లొచ్చినవారు గృహనిర్బందం, ఐసోలేషన్‌ వార్డుకు వెళ్లకుండా తప్పించుకొనేందుకు అబద్ధాలాడుతున్నారు. గుంటూరు నగరానికి చెందిన ముస్లిం యువకుడు ఇటీవల మక్కాకు వెళ్లి వచ్చాడు. అతడిని గృహనిర్బంధంలో ఉంచమని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశించింది.

ఆరోగ్య సిబ్బంది ఇంటికి వస్తే తాను మక్కా వెళ్లలేదని, కావాలంటే చుట్టుపక్కల విచారించుకోవాలని బుకాయించాడు. అయితే సిబ్బంది తగిన ఆధారాలు చూపడంతో కిక్కురుమనలేదు. బయట తిరగొద్దని, లేకుంటే ఐసోలేషన్‌ వార్డుకు పంపుతామని డీఎంహెచ్‌వో అతడిని హెచ్చరించారు. ఇలాంటి ఉదంతాలు రోజుకు ఐదారు వెలుగు చూస్తున్నాయి.