ప్రత్యేక హోదా అంశం మా పరిధిలోనిది కాదు... 15వ ఆర్థిక సంఘం చైర్మన్

Chandrababu
సిహెచ్| Last Updated: గురువారం, 11 అక్టోబరు 2018 (20:04 IST)
అమరావతి: రాష్ట్రాల ప్రత్యేక హోదా అంశం తమ పరిధిలోనిది కాదని 15వ ఆర్థిక సంఘం (ఫైనాన్స్ కమిషన్) చైర్మన్ నంద కిషోర్ సింగ్ స్పష్టం చేశారు.  సచివాలయం 5వ బ్లాక్ మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో గురువారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. 15వ ఆర్థిక సంఘం ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు రాష్ట్రంలో పర్యటిస్తోంది. అందులో భాగంగా కమిషన్ చైర్మన్, సభ్యులు గురువారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో, సాయంత్రం రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతరం చైర్మన్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యటిస్తూ పరిస్థితులను అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. 
 
బుధవారం కొన్ని పంచాయతీలను, ఆరోగ్య కేంద్రాలను సందర్శించినట్లు చెప్పారు. ఉదయం ముఖ్యమంత్రిని కలిసి రాష్ట్రంలోని పరిస్థితులను పూర్తిగా చర్చించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని పరిస్థితులను, సమస్యల తీవ్రతను సీఎం వివరించారని చెప్పారు. విభజన నేపధ్యం, ఆర్థిక లోటు, ప్రస్తుత పరిస్థితులు, విభజన చట్టంలోని హామీలు, ప్రత్యేక హోదా, అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం తదితర విషయాలను ఆయన వివరించినట్లు పేర్కొన్నారు. ఈ అంశాలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్రానికి తగిన ఆర్థిక సహాయం చేయవలసిందిగా కోరారన్నారు. ఆర్థిక సంఘాల నివేదికలకు 1971 జనాభా లెక్కలే ప్రాతిపదిక కావాలని ఆయన కోరినట్లు తెలిపారు. 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాలపై నేరుగా ప్రభావం పడుతుందని సీఎం పేర్కొన్నట్లు చెప్పారు.
 
విభజన నేపధ్యంలో రాష్ట్రం ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని సింగ్ పేర్కొన్నారు. నూతన రాజధాని అమరావతి నిర్మాణం, రాష్ట్రంలో ఆర్థిక వృద్ధి రేటు పెరుగుద, నీటి వనరులకు ప్రాధాన్యత ఇవ్వడం, నదుల అనుసంధానం, పోలవరం ప్రాజెక్ట్ వంటి అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం పనితీరుని, చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ప్రశంసించారు. వ్యవసాయ ఉత్పత్తులలో రాష్ట్రం మంచి పురోగతి సాధిస్తున్నట్లు తెలిపారు. టెక్నాలజీ, నాలెడ్జి ఎకానమీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి విషయాలలో రాష్ట్రం ప్రత్యేక గుర్తింపును సాధించినట్లు చెప్పారు. ఈ అంశాలలో చంద్రబాబు నాయకత్వాన్ని ప్రత్యేకంగా అభినందించారు. సీఎం డిమాండ్లను పరిగణనలోకి తీసుకొని అవకాశం ఉన్నంత వరకు రాష్ట్రానికి న్యాయం చేస్తామని చెప్పారు. ఏపీకి తగిన విధంగా సహాయం చేయడానికి కమిషన్ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
 
రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసి, విశ్లేషించడమేనని కమిషన్ పని అని సింగ్  తెలిపారు. ప్రత్యేక హోదాకు కమిషన్‌కు ఎటువంటి సంబంధంలేదన్నారు. అది జాతీయ అభివృద్ధి మండలి పరిధిలోనిదని తెలిపారు. తాము 29 రాష్ట్రాలలో పర్యటించి ఆర్థిక పరిస్థితులను పరిశీలిస్తామని చెప్పారు. ఇప్పటివరకు 12 రాష్ట్రాలలో పర్యటించామని, మిగిలిన రాష్ట్రాల పర్యటనలు కూడా ఈ ఏడాది చివరికి పూర్తి చేస్తామన్నారు. జనాభా లెక్కల విషయంలో రాష్ట్రపతి నోటిఫికేషన్‌కు అనుగుణంగా, దానికి కట్టుబడి పని చేస్తామని చెప్పారు. 
 
రాష్ట్ర విభజన సమయంలో తాను రాజ్యసభలో ఏపీకి మద్దతుగా మాట్లాడానన్నారు. అయితే ఇక్కడ కమిషన్ పరిధికి లోబడి మాత్రమే పనిచేయవలసి ఉంటుందన్నారు. తమ పరిధిలో వున్న అంశాలనే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన ఏ పరిస్థితుల్లో జరిగింది, ఎటువంటి సమస్యలను రాష్ట్రం ఎదుర్కొంటోంది.... తదితర అంశాలన్నిటినీ గమనంలో ఉంచుకొని సానుకూల దృక్పథంతోనే 15వ ఆర్ధిక సంఘం వ్యవహరిస్తుందని  సింగ్ చెప్పారు. రాజకీయ పార్టీలతో చర్చలు కూడా సానుకూల వాతావరణంలో జరిగినట్లు ఆయన తెలిపారు. సమావేశంలో 15వ ఆర్ధిక సంఘం సభ్యులు డాక్టర్ అశోక్ లహిరి, డాక్టర్ అనూప్ సింగ్, శక్తి కాంత్ దాస్, ప్రొఫెసర్ రమేష్ చంద్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.రవిచంద్ర, కార్యదర్శి పియూష్ కుమార్, ప్రత్యేక కార్యదర్శి కెవివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.దీనిపై మరింత చదవండి :