1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 28 జనవరి 2016 (13:54 IST)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నన్నపనేని రాజకుమారి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా తెలుగుదేశం పార్టీ సీనియర్ మహిళా నేత నన్నపనేని రాజకుమారి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1972లో జై ఆంధ్రా ఉద్యమంలో ప్రారంభమైన రాజకుమారి రాజకీయ ప్రస్థానం అంచలంచెలుగా ఎదిగారు. ముఖ్యంగా 1983లో ఎన్టీఆర్‌ ప్రోత్సాహంతో టీడీపీలో చేరిన ఆమె తొలి ప్రయత్నంలోనే వినుకొండ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1985లో నాదెండ్ల భాస్కరరావు మంత్రి వర్గంలో పర్యాటక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 
 
ఆ తర్వాత రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్‌లో చేరారు. 1994 తర్వాత ఆమె తిరిగి టీడీపీలోచేరి ఆరేళ్లు టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. పదేళ్లపాటు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఆమె సేవలను గుర్తించిన చంద్రబాబు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్సీ ఇస్తారని ఆమె ఆశించారు. అయితే, పార్టీ అధినేత ఆమెకు ఏకంగా కేబినెట్‌ హోదా కలిగిన మహిళా కమిషన చైర్‌పర్సన పదవిని కట్టబెట్టి ఆమెను ఆశ్చర్యానికి గురి చేశారు.