శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం

మాతృభాషకూ సముచిత ప్రాధాన్యం: విద్యా మంత్రి

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఆంగ్ల భాష నైపుణ్యాలను విద్యార్థులకు అందించి వారిని ప్రపంచస్థాయిలో పోటీకి తట్టుకునేలా తీర్చిదిద్దడం ప్రభుత్వం ఉద్దేశమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.

వెలగపూడి సచివాలయంలోని ప్రచార విభాగంలో ఆయన మీడియాతో మాట్లాడారు.  2020-21వ విద్యా సంవత్సరం  నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు ఆంగ్ల బోధనను ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి ప్రకటించారు.

విద్యా సంస్కరణల్లో భాగంగా 1 నుంచి 5వ తరగతి వరకు ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా పాఠ్యాంశాలను మార్పుచేయడం, ఆంగ్లంలో విద్యార్థులకు బోధనను అందించి సార్వత్రిక అవసరాలకు ధీటైన నైపుణ్యాలను పెంపొందించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

ఆంగ్ల బోధనకు సంబంధించి 98 వేల మంది ఉపాధ్యాయులు అవసరమని ప్రాథమికంగా గుర్తించామన్నారు. ఆంగ్లం బోధించే ఉపాధ్యాయులకు  వచ్చే జనవరి నుంచి మే నెల వరకు వివిధ దశల్లో  ఆంగ్లంలో శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.

అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఇఫ్లూ (ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ)  సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని వారితో కలిసి ఆంగ్లంలో శిక్షణ అందిస్తామన్నారు. ఆంగ్లం సార్వత్రిక భాష కావడంతో ఆ భాషా నైపుణ్యాలను విద్యార్థులలో పెంపొందించడంతో పాటు అన్ని విషయాలను ఆంగ్ల మాద్యమంలో పరిచయం చేయడం చారిత్రక అవసరంగా మారిందని మంత్రి  తెలిపారు.

రాష్ట్రంలో నాణ్యమైన విద్యను పొందడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర విద్యార్థులు రాణించేలా తీర్చిదిద్దేందుకు ఆంగ్ల మాద్యమంలో బోధన తప్పనిసరి అని పేర్కొన్నారు. విద్యార్థులకు ఆంగ్లంలో విద్యాబోధనతో పాటు మాతృభాషకు కూడా సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ మాతృభాషను విద్యాబోధనలో తప్పనిసరి పాఠ్యంశంగా చేర్చామన్నారు.

విద్యార్థుల నైపుణ్యాలను బోధనా మాద్యమాల వారీగా సమానంగా పెంపొందించడం సవాలుగా మారిందన్నారు. తెలుగు భాషా వికాసానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.  అన్ని సబ్జెక్టులు బోధిస్తూనే తెలుగును కూడా విద్యార్థులకు బోధిస్తామన్నారు. అందుకు గానూ తెలుగును ఒక సబ్జెక్టుగా ఉండేలా  కార్యచరణను రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు.

ప్రస్తుత విద్యాసంవత్సరంలో అక్టోబర్ నాటికి 70,90,217 మంది విద్యార్థులు చేరగా అందులో 44,21,529 (62.36 శాతం) మంది విద్యార్ధులు ఆంగ్ల మాద్యమంలో అభ్యసిస్తున్నారని వివరించారు. ఎస్సీలో 49.61 శాతం, ఎస్టీలలో 33.23 శాతం, బీసీల్లో 62.5 శాతం, ఓసీలు 82.6  శాతం ఆంగ్లంలో చదువుతున్నారని వెల్లడించారు.

పేదలకు దూరంగా ఉన్నత వర్గాలవారికే ఆంగ్ల మాద్యమం పరిమితమైనట్లుగా ప్రస్ఫుటమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో దాదాపు 45వేల స్కూళ్లలో నవంబర్‌ 14 వ తేదీ నుంచి నాడు-నేడు కార్యక్రమం చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా నాడు - నేడు కార్యక్రమం ప్రకాశం జిల్లాలో  ఈనెల 14వ తేదీన ప్రారంభిస్తున్నారని తెలిపారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా మొదటి దశలో  పాఠశాలల్లో మౌలికసదుపాయాల కల్పన ఉంటుందని వివరించారు.

అందులో భాగంగా తొమ్మిది రకాల పనులను చేపడతామని, ప్రతి పాఠశాలలోనూ మరుగుదొడ్లు, కాంపౌండ్‌వాల్స్, తాగునీరు, నీటి పారుదల, ఫర్నిచర్‌, ఫ్యాన్లు, బ్లాక్‌ బోర్డులు, లైటింగ్‌, పెయింటింగ్‌.. తదితర సౌకర్యాల ఏర్పాటును పరిశీలించి ఇప్పటి వరకు ఎలా ఉన్నాయి.. ఇకపై ఎలా ఉండాలి.. అనే విషయంపై దృష్టి పెట్టి చేపడతామన్నారు.