మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శనివారం, 24 ఏప్రియల్ 2021 (14:00 IST)

దోపిడీ దొంగల అరెస్ట్: ఒంటరి మహిళలే లక్ష్యంగా ఆభరణాల చోరీ

గుంటూరు: ఒంటరి మహిళలే లక్ష్యంగా చేసుకొని ఆభరణాలు దొంగిలిస్తున్న దోపిడీ ముఠాని, దొంగిలించిన వస్తువుల విక్రయానికి సహకారం అందించిన హెడ్ కానిస్టేబుల్‌ని, చోరీ సొత్తు అని తెలిసి కూడా కొనుగోలు చేసిన బంగారు నగల వ్యాపారిని అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి 2,50,000 విలువ చేసే ఆభరణాల్ని స్వాధీనం చేసుకున్నారు.

ఈ మేరకు ఎస్పీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ ఎస్పీ ఆర్.ఎన్ అమ్మిరెడ్డి మాట్లాడారు. వెంగళాయపాలెంలోని శ్రీశైలం కాలనీలో నివాసం ఉంటున్న... పువ్వాడ విజయలక్ష్మీ ఒంటరిగా ఇంట్లో టీవీ చూస్తున్న సమయంలో చింతలపూడి సాగర్ బాబు, పాదర్తి సురేష్, అచ్చి చిన్న సైదారావు అనే వ్యక్తులు ఆమె మెడలోని చైన్ని లాక్కొని వెళ్ళిపోయారు.

ఇలా వీరంతా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఒంటరి మహిళలే లక్ష్యంగా ఆభరణాలు చోరీ చేసి పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఈ క్రమంలో ఒక కేసుకు సంబంధించి గురజాల సబ్ - జైల్లో శిక్ష అనుభవిస్తున్న క్రమంలో ఆ ముద్దాయిలతో హెడ్ కానిస్టేబుల్ (ప్రస్తుతం ఫిరంగిపురం స్టేషన్) గా పనిచేస్తున్న.... కుమ్మెర్ల బసవరాజు వారు దొంగిలించిన వస్తువుల్ని అమ్మిపెడుతూ అందులో వాటా తీసుకునే వాడు.

అయితే ఇది దొంగిలించిన బంగారం అని తెలిసి కూడా....బంగారు నగల వ్యాపారీ ఆతుకూరి నాగేశ్వరరావు ఆ ఆభరణాల్ని కొనుగోలు చేశాడు. ఈ నేపథ్యంలో.....  అచ్చి చిన్న సైదారావు, పాదర్తి రమేష్, కుమ్మెర్ల బసవరాజు, ఆతుకూరి నాగేశ్వరరావుని అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. అయితే చింతల పూడి సాగర్ బాబు సత్తెనపల్లి సబ్ - జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో కేసుని చేధించడంలో చొరవ చూపిన నల్లపాడు పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఎస్పీ ఆర్.ఎన్ అమ్మిరెడ్డి రివార్డులు అందజేశారు.