శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 21 జులై 2020 (22:31 IST)

దళిత యువకుడి శిరోముండనం వెనక ఉన్న ప్రతి ఒక్కరినీ బాధ్యుల్ని చేయాలి: నాదెండ్ల మనోహర్

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్లో శ్రీ వరప్రసాద్ అనే దళిత యువకుడికి శిరోముండనం చేసి, చిత్ర హింసలకు గురి చేసిన ఘటన ప్రజాస్వామ్యానికే తల ఒంపులు తీసుకువచ్చింది. బాధ్యత కలిగిన పోలీసులు ఈ విధమైన అనాగరిక చర్యలకు ఒడిగట్టడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అధికార పక్షం నాయకులు ఒత్తిళ్లతోనే పోలీసులు ఈ పనులకు పాల్పడ్డారు.
 
పోలీస్ స్టేషన్ లోనే ఈ చర్యకు పాల్పడడం సిగ్గుచేటు అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేసే లారీలు ప్రమాదకరంగా మారాయని సీతానగరం ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో ఆందోళన చేస్తూనే ఉన్నారు. ప్రమాదానికి కారణమైన ఇసుక లారీని నిలువరించిన దళితులపై అక్రమ కేసులు బనాయించడమే కాకుండా, ఓ యువకుడిని శిరోముండనం చేసి అవమానించడాన్ని తీవ్రంగా పరిగణించాలి.
 
ఇసుక మాఫియాను అరికట్టకుండా, తమ ప్రాణాలను ఆ మాఫియా లారీల నుంచి కాపాడమన్నవారిని ఈ విధంగా హింసించడం ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు అద్దంపడుతోంది. ఈ కేసులో బాధ్యులుగా పోలీసులను సస్పెండ్ చేయడంతో సరిపోదు.
 
ఈ ఘటనకు పోలీసులను ప్రేరేపించిన అధికార పక్ష నాయకులను కూడా బాధ్యులను చేసి ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసులు నమోదు చేయాలి అన్నారు. దళితులపై, దళిత ఉద్యోగులపై దాడులు పెరగడాన్ని, వారిపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్న తీరునీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అని మనోహర్ పత్రికా ప్రకటనలో తెలిపారు.