1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 4 జులై 2015 (11:12 IST)

సీమాంధ్రులను తిట్టేందుకు కేసీఆర్ వాడిన భాషేంటో...?: తెరాస నేతలకు టీడీపీ నేతల ప్రశ్న

తెలంగాణ ఉద్యమసమయంలో సీమాంధ్రులను తిట్టేందుకు తెరాస అధినేతగా కేసీఆర్ వాడిన భాష ఎలాంటిదో తెరాస నేతలు ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోవాలని తెలుగుదేశం పార్టీ నేతలు సూచన చేస్తున్నారు. కేసీఆర్ కుట్ర కారణంగా ఓటుకు నోటు కేసులో 30 రోజుల పాటు జైలు జీవితం గడపి విడుదలైన రేవంత్ రెడ్డి కడుపుమండి నాలుగు మాటలు మాట్లాడితే వాటిపై రాద్ధాంతం చేసి కేసులు పెడతారా అంటూ ప్రశ్నించారు. 
 
ఇదే అంశంపై తెలుగు మహిళ అధ్యక్షురాలు బి శోభారాణి, టీడీపీ అధికార ప్రతినిధి ఒంటేరు ప్రతాప్ రెడ్డిలు మాట్లాడుతూ రేవంత్ ఒక్క రోజు మాట్లాడిన భాష గురించి లబోదిబోమంటున్న టీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ తిట్లపురాణం, మాట్లాడిన బూతుల గురించి తెలియదా? అని అడిగారు. కేసీఆర్‌కు అర్థంకావాలన్న ఉద్దేశంతోనే రేవంత్ కేసీఆర్ భాషలోనే మాట్లాడాడని వారు స్పష్టంచేశారు.
 
రేవంత్ రెడ్డి జైలు నుంచి విడుదలైన తర్వాత ర్యాలీ నిర్వహించలేదని, ఇంటికి వెళ్లే క్రమంలో ర్యాలీ జరిగిందని వారు వివరించారు. అలాగే, రేవంత్ రెడ్డికి అభిమానులు, పార్టీ కార్యకర్తలు గండ్రగొడ్డలి, ఖడ్గం వంటివాటిని బహూకరిస్తే వాటిని మారణాయుధాలు ప్రదర్శించాడని కేసు పెట్టడం విచిత్రంగా ఉందన్నారు. పలు బహిరంగ సభల్లో కేసీఆర్, ఇతర నేతలు కత్తులు, బాణాలు, గదలు పట్టారని వాటి సంగతేంటని వారు ప్రశ్నించారు.