యువతి విషయంలో గొడవ - విద్యార్థిని బంధించి చిత్ర హింసలు
భీమవరంలో అమానుష ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ యువతి విషయంలో గొడవపడిన కొందరు ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని గదిలో బంధించి చిత్ర హింసలు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన అంకిత్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఓ యువతి విషయంలో నలుగురు విద్యార్థులు అంకిత్‌తో గడవపడ్డారు. ఈ క్రమంలో ఈ నెల 2వ తేదీన అంకిత్‌ను హాస్టల్‌లోని తమ గదికి పిలిచి అతన్ని బంధిచి కర్రలతో చావబాదారు. ఆపై ఇస్త్రీపెట్టెతో వాతలు పెట్టారు. తనను విడిచిపెట్టాలని బాధిత విద్యార్థి ప్రాధేయపడినా వారు ఏమాత్రం కనికిరించలేదు.
యువకుడిని చితకబాదుతుండగా ఇతర విద్యార్థులు తీసిన వీడియో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు స్పందించారు. దాడికి పాల్పడిన ప్రవీణ్, నీరజ్, స్వరూప్, ప్రేమలపై కేసు నమోదుచేశారు. వీరందా శ్రీకాకులళం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన వారే కావడం గమనార్హం. మరోవైపు, ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన కాలేజీ యాజమాన్యం ఆ నలుగురు విద్యార్థులతో పాటు వివాదానికి కారణమైన యువతిని కూడా కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు.