శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 16 జనవరి 2020 (08:16 IST)

ఇక బీజేపీ, జనసేనలది ఒకే బాట.. నేడు కార్యాచరణ

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. భారతీయ జనతాపార్టీ, జనసేన పార్టీలు కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యాయి. రెండు పార్టీల ముఖ్యనేతలు ఇవాళ విజయవాడలో సమావేశమై ఉమ్మడి కార్యాచరణ ప్రకటించనున్నారు. అమరావతిలో రాజధాని కొనసాగింపు అంశమే తొలి పోరాట అజెండా కానుంది. 
 
ఇటీవల భాజపా కేంద్ర నాయకత్వం పిలుపు మేరకు దిల్లీ వెళ్లిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ రాష్ట్రంలోని పరిస్థితుల గురించి చర్చించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏ ఆశయాలతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారో.. ఆ ఆశయాలకు రాష్ట్రంలో తూట్లు పడుతున్నాయని పేర్కొన్నారు. 
 
మూడు రాజధానుల అంశం, పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోవడం, అమరావతిలో 144 సెక్షన్ విధించడం, రైతుల సమస్యలు, మహిళలపై దాడుల గురించి ప్రస్తావించినట్లు సమాచారం. 
 
2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, సామాన్యుల ఇబ్బందులపై వివిధ రూపాల్లో పవన్‌ విమర్శలు సంధిస్తూ వచ్చారు. ప్రస్తుతం రాజధాని మార్పు అంశంపై ప్రభుత్వ చర్యలు వేగవంతం అవుతున్న తరుణంలో.. ఒంటరిగా పోరు సాగించే కంటే కేంద్రంలో అధికారంలోని భాజపాతో కలిసి వెళ్లటం మంచిదనే నిర్ణయానికి జనసేన వచ్చింది. 
 
జనసేనతో కలిసి నడవడంపై భాజపా ముఖ్యనేతలు గురువారం ఉదయం విజయవాడలో భేటీ కానున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణతో పాటు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సునిల్ దేవ్ ధర్, జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తో పాటు మరికొందరు ముఖ్యనేతలు మాత్రమే ఈ సమావేశంలో పాల్గొననున్నారు. 
 
దిల్లీ నాయకుల సూచనల మేరకు ఏ ఏ అంశాలలో కలిసి వెళ్లాలనే దానిపై ఇరు పార్టీల నేతలు చర్చించి ఓ నిర్ణయానికి వస్తారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్తారు. 
 
అనంతరం రెండు పార్టీల నాయకులు ఉదయం 11 గంటలకు విజయవాడలోని హోటల్‌ మురళీ ఫార్చ్యూన్‌లో సమావేశం కానున్నారు. జనసేన నుంచి పవన్ కల్యాణ్‌తో పాటు రాజకీయ వ్యవహారాల కమిటీ  ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ఒకరిద్దరు పీఏసీ సభ్యులు మాత్రమే హాజరవుతారు. 
 
రాజధాని అమరావతి అంశంపై ఉమ్మడి పోరు గురించి చర్చించనున్నారు. రాజధాని తరలింపును మాత్రం రెండు పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. భాజపా అమరావతినే రాజధానిగా ఉంచాలనే తీర్మానం చేసింది. 
 
జనసేన కూడా ఒకేచోట నుంచి పాలన... అభివృద్ధి వికేంద్రీకరణ అని తీర్మానించింది. ఇవాళ జరిగే సమావేశంలో పార్టీ వైఖరి నిర్ణయిస్తామని.... అనంతరం జనసేన నేతల్ని కలుస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మి నారాయణ తెలిపారు. సమావేశంలో కేంద్రపార్టీ సూచనలే అంతిమమని కన్నా వెల్లడించారు.