శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 డిశెంబరు 2020 (17:49 IST)

ఉండవల్లిగారు.. ఊసరవెల్లిగా మారొద్దు : బీజేపీ నేత విష్ణువర్థన్

రాజమండ్రి మాజీ మంత్రి ఉండవల్లి అరుణ్ కుమార్‌పై బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యంగా, ఇటీవలి కాలంలో ఉండవల్లి తరచుగా మీడియాతో మాట్లాడటాన్ని ఆయన తప్పుబట్టారు. ఉండవల్లిగారు, మీరు ఊసరవెల్లిలా మారొద్దంటూ హితవు పలికారు. మీరు ఎవరి కోసం మాట్లాడుతున్నారో... ఏ పార్టీని ఆంధ్రరాష్ట్రంలో బ్రతికించాలని తాపత్రయపడుతున్నారో అందరికీ తెలుసని స్పష్టంచేశారు. దాని వెనకున్న రహస్యం కూడా అందరికీ తెలుసని పేర్కొన్నారు.
 
ఇక, బీజేపీలో ఎందుకు చేరాలి? ఎందుకు చేరకూడదు? అనే అంశాలు చేరేవాళ్లకు తెలుసని, మీ భ్రమకాకపోతే, రాజకీయ అస్త్రసన్యాసం చేసిన మీలాంటి వారి సలహాలు వారు ఎందుకు తీసుకుంటారని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు.
 
'ఆర్ఎస్ఎస్ గురించి మీరు చాలా విమర్శలు చేశారు. మీరు నమ్మిన కాంగ్రెస్, మీరు ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ పార్టీకి చెందిన నెహ్రూ 1963 రిపబ్లిక్ డే వేడుకలకు ఆర్ఎస్ఎస్‌ను ఆహ్వానించారు. చరిత్ర అంతా మీకే తెలిసినట్టు 95 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆర్ఎస్ఎస్ గురించి మీరు ఇవాళ అవహేళన చేస్తూ మాట్లాడారు. 
 
ఆర్ఎస్ఎస్ ప్రేరణతో నేడు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి అత్యున్నత పదవుల్లో దేశం కోసం పనిచేస్తున్నారు. మేధావులు కదా మీరు... ఈ చరిత్ర తెలియదా? తెలియకపోవచ్చులే... మనం మేధావి ముసుగులో ఉన్నాం కదా' అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.