గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

దేనికైనా సిద్ధమంటున్న వీర్రాజు : జనసేనానితో సమావేశం!!

తిరుపతి లోక్‌సభకు త్వరలో ఉప ఎన్నిక జరుగనుంది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న వైకాపా నేత బల్లి దుర్గాప్రసాద్ కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ స్థానంలో పోటీ చేసే అంశంపై బీజేపీ - జనసేన పార్టీలు కలిసి ఓ నిర్ణయం తీసుకోనున్నాయి. 
 
ఇదే అంశంపై చర్చించేందుకు బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఆదివారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా, తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలు ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలపాలని భావిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో మరింత అవగాహన కోసం బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు జనసేనాని పవన్ కల్యాణ్‌తో సమావేశం కావడం కీలకంగా మారింది. హైదరాబాదులో జరిగిన ఈ సమావేశంపై జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తిరుపతి ఎంపీ అభ్యర్థి, తాజా రాజకీయ పరిస్థితులు వీరిద్దరి మధ్య చర్చకు వచ్చాయని ఆ ప్రకటనలో తెలిపారు.
 
2024 ఎన్నికల్లో గెలిచి ఏపీలో బీజేపీ-జనసేన సంయుక్తంగా అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని, అందుకు తిరుపతి లోక్‌సభ స్థానం ఉప ఎన్నికలతో నాంది పలకాలని పవన్, సోము వీర్రాజు నిర్ణయించారు. ఏదైనా అంశంలో అభిప్రాయభేదాలు ఉంటే ఎప్పటికప్పుడు చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకోవాలని తీర్మానించారు. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ, జనసేనల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఉమ్మడి అభ్యర్థిగానే భావించి విజయానికి కృషి చేయాలని అవగాహనకు వచ్చారు.