ఎన్నికల సమయంలో బాబును బుక్ చేసిన బిజెపి నేత..?
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రభుత్వ అజమాయిషీ నుంచి తప్పించాలని కోరుతూ, టిటిడిలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై సిబిఐ విచారణకు ఆదేశించాలని అభ్యర్థిస్తూ బిజెపి ఎంపి సుబ్రమణ్యస్వామి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రభుత్వ అజమాయిషీ నుంచి తప్పించాలని కోరుతూ, టిటిడిలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై సిబిఐ విచారణకు ఆదేశించాలని అభ్యర్థిస్తూ బిజెపి ఎంపి సుబ్రమణ్యస్వామి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైదరాబాద్‌కు వచ్చిన ఆయన కోర్టుకు పిటిషన్ సమిర్పంచారు. వాస్తవంగా ఈ పిటిషన్‌ను ఆయన ముందుగా సుప్రీంలో దాఖలు చేశారు. అయితే…. ఇప్పటికే అటువంటి కేసులు రాష్ట్ర హైకోర్టు పరిశీలనలో ఉన్న నేపథ్యంలో అక్కడికే వెళ్లాలని సుప్రీం సూచించింది. దీంతో సుబ్రమణ్యస్వామి హైకోర్టును ఆశ్రయించారు.
రాష్ట్ర హైకోర్టులో పది రోజుల్లో ఈ కేసు విచారణకు రానుంది. అప్పుడు మళ్లీ హైదరాబాద్ వస్తానని, ఈ కేసును తానే స్వయంగా వాదిస్తానని సుబ్రమణ్యస్వామి ప్రకటించారు. స్వామి పిటిషన్‌కు విచారణార్హత లేదని అటు సుప్రీంగానీ, ఇటు హైకోర్టుగానీ చెప్పకపోవడం విశేషం. హైకోర్టుకు వెళ్ళమని సుప్రీం చెప్పడమే ఈ కేసులో తనకు మొదటి సానుకూలత అని ఆయన ఆరోజు వ్యాఖ్యానించారు.
శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు…. టిటిడిపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. శ్రీవారి ఆభరణాలు మాయం అయ్యాయని, పోటులో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారని, స్వామివారికి కైంకర్యాలు సరిగా జరగడం లేదని రమణ దీక్షితులు ఆరోపించారు. దీంతో ఆయన్ను 24 గంటల్లో ప్రధాన అర్చక పదవి నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో న్యాయ పోరాటంలో భాగంగా ఆయన సుబ్రమణ్యస్వామిని కలిశారు. తన ఆరోపణలపై సిబిఐ విచారణను కూడా దీక్షితులు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
టిటిడి వ్యవహారాలపై స్పందించిన సబ్రమణ్యస్వామి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ చట్టాలను, పురావస్తు శాఖ చట్టాలను దాదాపు నెల రోజుల పాటు సమగ్రంగా అధ్యయనం చేసిన తరువాత పిటిషన్ సిద్దం చేశారు. దీనిపైన సుప్రీం కోర్టే విచారణ జరిపి వుండేది. అయితే… ఇంతలోనే గుంటూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు రాష్ట్ర హైకోర్టులో దాదాపు ఇవే అంశాలపై కేసు వేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న సుప్రీంకోర్టు…. సుబ్రమణ్యస్వామిని కూడా అక్కడికే వెళ్లమని సూచించింది.
సుబ్రమణ్యస్వామి తన పిటిషన్‌లో… టిటిడిపై ప్రభుత్వ అజమాయిషీ వల్ల నిధులు దుర్వినియోగం అవుతున్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా వంశపారంపర్య అర్చకత్వం, పురావస్తు కట్టడంగా శ్రీవారి ఆలయ పరిరక్షణ వంటి అంశాలనూ ప్రధానంగా కోర్టు ముందు ఉంచారు. హైకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల సమయంలో టిటిడి వ్యవహారంపై ఇప్పటికిప్పుడు బిజెపి నేత సుబ్రమణ్యస్వామి కోర్టుకు వెళ్ళడంతో టిడిపి నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.