బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 18 మార్చి 2021 (12:17 IST)

ప్రజల్లో సీఎం జగన్‌పై అభిమానం చెక్కు చెదరలేదు: మంత్రి బొత్స

రాష్ట్ర ప్రజల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల ఉన్న ప్రేమాభిమానులు ఏమాత్రం చెక్కుచెదరలేదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తాజాగా వెల్లడైన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బొత్స మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో ఆయన మాట్లాడిన మాటలు ఆయన మాటల్లోనే...
 
మాట నిలబెట్టుకుంటే ఆశీర్వదిస్తారు:
‘ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ పని చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. రాష్ట్రంలో గతంలో సాధారణ ఎన్నికలు అయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేవి. అందువల్ల సాధారణ ఎన్నికల ఫలితాల ప్రభావం వాటి పైనా ఉండేది. ఇప్పుడే కదా అధికారంలోకి వచ్చింది అవకాశం ఇస్తే పోతుంది కదా అని ప్రజలూ భావించేవారు. కానీ ఇప్పుడు అలా జరగలేదు. శ్రీ వైయస్‌ జగన్‌ నాయకత్వంలో ఈ ప్రభుత్వం వచ్చి 21 నెలలు అవుతోంది. మొట్టమొదటిసారిగా బ్యాలెట్‌ మీద స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి’.
 
చంద్రబాబుది అర్ధరహిత వాదన:
‘పంచాయతీ ఎన్నికల్లోనూ 80శాతం మంది వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరుల్నే ప్రజలు గెలిపించారు. అప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు 38శాతం, 40శాతం, 50శాతం స్థానాలు తమకు వచ్చాయని అన్నారు. అది సరి కాదని మేం ఫొటోలతో సహా చూపించినా, చంద్రబాబు అడ్డగోలుగా వాదించారు. దీంతో ఆయనను ఆనందపడమని చెప్పాం. గ్రామాల్లో సర్పంచ్‌ ఏ పార్టీకి చెందిన వ్యక్తి అన్నది అందరికీ తెలుస్తుంది. అయినా టీడీపీ నేతలు 30%, 40% స్థానాలు కైవసం చేసుకున్నామని దబాయించారు. కానీ ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో పార్టీ గుర్తుల మీద ఎన్నికలు జరిగాయి. ఇవాళ మొత్తం 12 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా, ఫలితాలు ప్రకటించిన 11 కార్పొరేషన్లలో ప్రజలు వైయస్సార్‌సీపీకి ఒక ప్రభంజనంలో పట్టం కట్టారు. 
 
మరింత పట్టుదలతో..:
‘సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ నాయకత్వంలో పని చేస్తున్న మా అందరిపై బాధ్యత ఎంతో పెరిగింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు ప్రజలు ఇంకా ఎంతో సేవ చేయాల్సిన అవసరం ఉంది. అనంతపురం కార్పొరేషన్‌లో 50 స్థానాలు ఉంటే 48 స్థానాల్లో వైయస్‌ఆర్‌సీపీకి పట్టం కట్టారు. విజయనగరం, తిరుపతిలో టీడీపీకి ఒకటో, రెండో స్థానాలు వచ్చాయి. ఇక్కడ వచ్చిన రెండు స్థానాలు కూడా పార్టీ రెబల్స్‌కు దక్కాయి తప్ప టీడీపీ ఖాతాలోకి వెళ్లలేదు. ఇదీ ఇక్కడ ఉన్న ప్రత్యేకత. రాబోయే కాలంలో మరింత పట్టుదలగా పని చేస్తాం’. 
 
సోషల్‌ ఇంజనీరింగ్‌:
‘రేపు (18వ తేదీన) మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్‌ ఛైర్మన్లు, వైస్‌ ఛైర్మన్ల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇచ్ఛాపురం నుంచి హిందూపురం వరకు 75 మున్సిపాలిటీలు, 11 కార్పొరేషన్లకు సోషల్‌ ఇంజనీరింగ్‌ జరగాలని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఆశిస్తున్నారు. అందు కోసం జనాభా, సామాజికవర్గాలను ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. గత సాధారణ ఎన్నికల్లో ఎంపిక చేసిన విధంగా ఇప్పుడు కూడా సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఒకరిద్దరికి ఇబ్బందులు ఉన్నా సోషల్‌ ఇంజనీరింగ్‌ పార్టీకి అవసరం’. 
 
కొత్త ఒరవడికి శ్రీకారం:
‘రాజకీయాల్లో కొత్త విధానాన్ని, కొత్త ఒరవడిని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ తీసుకువస్తున్నారు. అనంతపురం మేయర్‌ స్థానాన్ని మైనార్టీలకు ఇవ్వాలని నిర్ణయించాం. డిప్యూటీ మేయర్‌ను బలిజకు కేటాయించాం. మరో డిప్యూటీ మేయర్‌ను, వైస్‌ ఛైర్మన్‌ను నియమించాలని నిర్ణయించాము. గవర్నర్‌ నుంచి ఆర్డినెన్స్‌కు అనుమతి రాగానే వారిని ఎంపిక చేయటం జరుగుతుంది. ఛైర్మన్లను సీఎం గారు స్వయంగా ప్రకటిస్తారు’.. అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రెస్‌మీట్‌ ముగించారు.