స్ట్రాంగ్ రూమ్‌లకు నేను నా తాళాలు వేసుకుంటా.. ఈసీకి లేఖ
ఏప్రిల్ 11వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలు ముగిశాయి. ఓటర్ మహాశయులు ఇచ్చిన తీర్పు ఈవీఎంలో నిక్షిప్తమైంది. మూడంచెల భద్రతతో ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలు భద్రంగా ఉన్నాయి. కాగా ఇటీవల టీఆర్ఎస్ కార్యకర్త ఒకరు ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్‌లో దిగిన ఫోటో కాస్త వైరల్‌గా మారడంతో ఈవీఎంల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణలోని నిజామాబాద్ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఓ వింత వినతితో ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఇప్పటికే ఆ స్థానానికి రైతుల్లో చాలా మంది పోటీ పడి దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన నియోజకవర్గం అది.
అయితే బీజేపీ లోక్‌సభ అభ్యర్థి ధర్మపురి అరవింద్ మాత్రం తాను పోటీచేసిన నిజామాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలు భద్రపరచిన గదికి తనను తాళాలు వేసుకోవడానికి అనుమతించాలని కోరారు. స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర ఉన్న భద్రతపై తనకు నమ్మకం లేనందువల్ల తనను తాళాలు వేసుకొనేందుకు అనుమతించాలని కోరుతూ అరవింద్ ఈసీకి లేఖ రాశారు.