శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 జులై 2024 (10:09 IST)

ఇకపై అమరావతికి మహర్ధశ : ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్రం పచ్చజెండా!!

outer ring road
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో రాజధాని అమరావతి ప్రాంతానికి మహర్ధశ వచ్చింది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్‌లు ప్రమాణ స్వీకారం చేయడం, కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారు మనుగడ సాగించాలంటే టీడీపీ, జనసేన పార్టీల మద్దతు కీలకమైంది. దీంతో ఏపీ ప్రభుత్వం అడిగిన కోర్కెలను తీర్చేందుకు కేంద్రం ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయడం లేదు. తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించి, రాష్ట్రానికి కావాల్సిన ప్రాజెక్టు, నిధులు తదితర అంశాలపై చర్చించారు. ఇందులోభాగంగా, రాజధాని అమరావతిని మరింతగా అభివృద్ధి చేసే చర్యల్లో భాగంగా, ఔటర్ రింగ్ రోడ్డు సహా పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేయించుకుని వచ్చారు. 
 
ముఖ్యంగా, రాజధాని అమరావతిని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానించే పలు రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. వాటిలో 189 కి.మీ. పొడవైన అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) సహా కీలక ప్రాజెక్టులున్నాయి. అవన్నీ 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం చేపట్టి, కొంత ముందుకు తీసుకెళ్లాక అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం అటకెక్కించిన, ఖూనీ చేసిన ప్రాజెక్టులు, విభజన చట్టంలో ఉన్న ప్రాజెక్టులే. 
 
ముఖ్యమంత్రి చంద్రబాబు వాటన్నిటినీ మళ్లీ కేంద్రం ముందుంచి.. ప్రాథమిక ఆమోదం లభించేలా చేశారు. కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన స్టాండింగ్ ఫైనాన్షియల్ కమిటీతో పాటు, ప్రధానమంత్రి కార్యాలయం ఆమోదం పొందాక అవన్నీ ఆచరణలోకి వస్తాయి. ఇప్పుడు ప్రాథమిక ఆమోదం పొందినవన్నీ గ్రీన్ ఫీల్డ్ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌ రహదారులే కావడం గమనార్హం. ఆ ప్రాజెక్టులు సాకారమైతే అమరావతికి మిగతా ప్రాంతాలతో చాలా సులువైన, మెరుగైన కనెక్టివిటీ ఏర్పాటవుతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి ఢిల్లీ పర్యటనలోనే కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో గురువారం జరిపిన భేటీలో వాటికి ప్రాథమిక ఆమోదం లభించింది.
 
అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టుకు భూసేకరణ సహా మొత్తం రూ.20-25 వేల కోట్లకుపైగా నిర్మాణ వ్యయాన్ని భరించేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అమరావతి, హైదరాబాద్ మధ్య మెరుగైన అనుసంధానం కోసం ఇప్పుడున్న జాతీయ రహదారికి ప్రత్యామ్నాయంగా.. 60-70 కి.మీ. దూరం తగ్గేలా ఆరు వరుసల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ నిర్మాణానికి కేంద్రం ప్రాథమికంగా సమ్మతించింది. 
 
శ్రీసత్యసాయి జిల్లాలోని కొడికొండ నుంచి మేదరమెట్ల వరకు తలపెట్టిన ఎక్స్‌ప్రెస్‌ని అమరావతితో అనుసంధానిస్తూ.... మేదరమెట్ల - అమరావతి మధ్య 90 కి.మీ. పొడవైన గ్రీన్ ఫీల్డ్ హైవేని నిర్మించాలన్న ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించింది. ఓఆర్ఆర్ సహా ఈ రహదారుల నిర్మాణం మొదలైతే... రెండు మూడు సంవత్సరాల్లోనే సమూల మార్పులు వస్తాయి. రాజధాని అమరావతితో పాటు, మొత్తం ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రమే మారిపోతుందని సీఎం చంద్రబాబు కేంద్రానికి వివరించారు. తద్వారా మౌలిక వసతుల కల్పన వేగం పుంజుకుంటుంది. అభివృద్ధి పరుగులు తీస్తుంది. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయి. అమరావతికి మెరుగైన అనుసంధానత ఏర్పడితే.. పెట్టుబడిదారులు క్యూకడతారు. లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలు ఏర్పడతాయన్నది ఏపీ ప్రభుత్వ ప్రగాఢ విశ్వాసంగా ఉంది.