శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శనివారం, 29 ఏప్రియల్ 2017 (17:35 IST)

ఇక రాజకీయ సన్యాసమే... శ్రీవారి సేవకే అంకితమవుతారా...?

టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా రెండేళ్ళు పనిచేసిన చదలవాడ క్రిష్ణమూర్తి ఈ నెల 26తో ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు. మొదటి యేడాదే అనుకున్నా ఆ తరువాత మరో యేడాదిపాటు పదవీకాలం పొడిగించడంతో రెండేళ్ళపాటు శ్రీవారి సేవ చేసే భాగ్యం చదలవాడకు లభించింది.

టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా రెండేళ్ళు పనిచేసిన చదలవాడ క్రిష్ణమూర్తి ఈ నెల 26తో ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు. మొదటి యేడాదే అనుకున్నా ఆ తరువాత మరో యేడాదిపాటు పదవీకాలం పొడిగించడంతో రెండేళ్ళపాటు శ్రీవారి సేవ చేసే భాగ్యం చదలవాడకు లభించింది. గత శాసనసభ ఎన్నికల్లో తిరుపతి టిక్కెట్టు కోసం వెంకటరమణ, చదలవాడ క్రిష్ణమూర్తి పోటీ పడితే ప్రభుత్వంలోకి వచ్చాక టిటిడి ఛైర్మన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చి చదలవాడను పోటీ నుంచి తప్పించారు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు.
 
అప్పుడు ఇచ్చిన మాట ప్రకారమే చదలవాడకు టిటిడి ఛైర్మన్ పదవిని కట్టబెట్టారు. దేశ, విదేశాల్లో గౌరవ ప్రతిష్టలున్న ఛైర్మన్ పదవి దక్కడంతో ఆనంద పరవశులయ్యారు. శ్రీవారి సేవలో రెండేళ్ళ పదవీకాలం రెండు క్షణాల్లో గడిచిపోయింది. ఆ పదవి నుంచి తప్పుకున్నాక క్రిష్ణమూర్తి ఇప్పుడు ఏమి చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఆయన తిరిగి రాజకీయాల్లో క్రియాశీలకం అవుతారా? లేక కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారా. 
 
ఇక తమ కుటుంబం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండబోదని చదలవాడ క్రిష్ణమూర్తి ఒకటి రెండు సంధర్భాల్లో ప్రకటించారు. అయితే ఆయన సతీమణి సుచరిత మొన్నటి ఎంఎల్సి ఎన్నికల్లో ఉపాధ్యాయ అభ్యర్థిగా బరిలోకి దిగి చివరి నిమిషంలో తప్పుకున్నారు. సుచరిత విషయం పక్కనబెడితే క్రిష్ణమూర్తి ఏం చేస్తారనేది ప్రశ్న. ఆయన మాటలను గమనిస్తే.. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండే ఆలోచనలో లేనట్లు అనిపిస్తుంది. 
 
టిటిడి ఛైర్మన్‌గా ఈ నెల 26వ తేదీ చివరి మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఏమి చేస్తారనేది త్వరలోనే ప్రకటిస్తాను. టిటిడి ఛైర్మన్ అయ్యాక నాలో చాలా మార్పు వచ్చింది. చూసేవాళ్ళు ఆ క్రిష్ణమూర్తేనా ఈ క్రిష్ణమూర్తి అని అంటున్నారు. నేను దాదాపుగా రెండేళ్ళుగా రాజకీయాల్లో రిటైర్డ్ అయినట్లేనని అన్నారు. చదలవాడ మాటలను చూస్తే రాజకీయాలకు దూరంగా ఉండాలన్నదే ఆయన అభిప్రాయంగా కనబడుతుంది. పూర్తిగా శ్రీవారి సేవకే అంకితమవుతారా...?