సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 15 ఆగస్టు 2014 (14:59 IST)

కేసీఆర్‌‌తో కలిసి పనిచేస్తామన్న బాబు: తుగ్లక్ పాలన.. ఔరంగజేబే బెటరన్న...?

రాష్ట్ర విభజన అనంతరం తలెత్తిన సమస్యలను పరిష్కరించుకునేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ క్రమంలో తెలంగాణ సర్కారుతో చర్చలకు సిద్ధమని తెలిపారు.
 
వివాదాస్పద అంశాలపై రెండు రాష్ట్రాలు కూర్చుని మాట్లాడుకోవడం మేలని సూచించారు. విభేదాలు రాష్ట్ర ప్రజలకు శ్రేయస్కరం కాదని బాబు అభిప్రాయపడ్డారు.పొరుగు రాష్ట్రాలతో సన్నిహిత సంబంధాలకే మొగ్గుచూపుతామని చెప్పారు. కర్నూలులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా బాబు ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
 
మరోవైపు కేసీఆర్‌ది తుగ్లక్ పాలన అని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం బాధాకరమని ఎర్రబెల్లి తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ మాయమాటలతో అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్ వెంటనే అమలు చేయాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.
 
అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఔరంగజేబు కంటే పెద్ద నియంత అని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మండిపడ్డారు. తండ్రిని చంపి అధికారంలోకి వచ్చిన ఔరంగజేబు కూడా తన ప్రజలను ప్రేమించాడని... కేసీఆర్‌కు ప్రజలంటే లెక్కే లేదని ఆరోపించారు. ప్రస్తుతం టీఆర్ఎస్ అనుభవిస్తున్న అధికారం... కాంగ్రెస్ వేసిన భిక్ష అని అన్నారు.
 
సమగ్ర సర్వేతో తెలంగాణ ప్రజల జాతీయత, ప్రాంతీయత ఒక్క రోజులో తేల్చేస్తారా? అని ప్రశ్నించారు. ఆ రోజు ఇంట్లో లేకుంటే తెలంగాణ వారు కానట్టేనా? అని నిలదేశారు. కనీసం రెండు, మూడు రోజుల సమయం కూడా ఇవ్వరా? అని అన్నారు. కేసీఆర్‌ది ఫాసిస్టు విధానమని మండిపడ్డారు. తెలంగాణలో ఇంతకుముందు విధివిధానాలు, నిబంధనలు లేనట్టు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.