1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (11:06 IST)

హైదరాబాద్ వాసులకు కనికరం లేదు.. అంతగా అభివృద్ధి చేసినా.. ఒక్క సీటేనా : చంద్రబాబు ఆవేదన

హైదరాబాద్ నగరాన్ని ఎవరూ చేయని విధంగా అభివృద్ధి చేసి, అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన తమ పార్టీని గ్రేటర్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించడంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. గ్రేటర్‌లో కేవలం ఒకే ఒక్క సీటుకు పరిమితం చేసిన విషయంపై మీడియా చంద్రబాబు స్పందన కోరింది. 
 
దీనికి బాబు సైతం తనదైన శైలిలో సమాధానం చెబుతూ "చేసిన అభివృద్ధి నేను ఫలితం ఆశించి చేసినది కాదు. ఫలితం ఆశిస్తేనే బాధ కలుగుతుంది. నేను బాధ పడటం లేదు. ఫర్వాలేదు. నా బాధ్యతలు నేను నిర్వర్తించాను. నాకు ఓట్లు వేస్తారా? ప్రజలు నాతోనే ఉంటారా? అని ఆలోచిస్తూ అభివృద్ధికి పాటు పడలేదు. తెలుగుదేశం ఓడిపోవడాన్ని విశ్లేషిస్తూ, ఇంటర్ నెట్ లో ఒక వ్యక్తి రాసిన లేఖ చదివితే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి" అన్నారు.
 
అంతేకాకుండా, ఎవరు ఎక్కడ పుట్టాలన్నది మానవుల చేతుల్లో ఉండదన్నారు. కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో పుడితే పుష్కలంగా నీరుంటుంది. సీమలో పుడితే నీరు దొరకదు. ఎవరి చేతుల్లోనూ లేని కులం, ప్రాంతాలతో రాజకీయాలు చేయడం సరికాదని వైకాపాను ఉద్దేశించి హితవు పలికారు. మీడియా సైతం తనను విమర్శిస్తే ప్రాధాన్యం ఇస్తోందని, బ్రహ్మాండంగా జరిగిన విశాఖ ఫ్లీట్ రివ్యూకు సరైన కవరేజ్ రాలేదని అసహనాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణలోని ఎల్బీ నగర్‌లో ఆర్ కృష్ణయ్యను పోటీలో దింపడం వల్లే తమకు మెజారిటీ తగ్గిందని సొంత పార్టీ ఎమ్మెల్యేపైనా రుసరుసలాడారు.