1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (12:49 IST)

చంద్రబాబు ఇంటివద్దే వీధి దీపాలు చోరీ చేసిన గజదొంగలు.. ఏపీ సీఎం నివాస భద్రతలో డొల్లతనం!

అది కృష్ణా నది కరకట్ట. ఇక్కడ అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించి నివాసం లింగమనేని గెస్ట్ హౌస్. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి తాత్కాలిక నివాసం. అడుగడుగునా సీసీ కెమెరాలు. కేవలం పగటిపూట మాత్రమే కాదు.. రాత్రి వేళల్లో కూడా చీమ చిటుక్కుమన్నా కనపడేలా భారీ వెలుగునిచ్చే అత్యంత ఖరీదైన ఎల్.ఈ.డి లైట్లు. ఇక జెడ్ కేటగిరీ భద్రత. 24 గంటల పాటు పోలీసులు పహారా కాస్తుంటారు. చంద్రబాబు భద్రత దృష్ట్యా పోలీసులు భారీగానే ఏర్పాట్లు చేశారు. 
 
అలాంటి ప్రదేశంలోనే గజదొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. ఈ చోరీ జరిగిన 15 రోజుల తర్వాత పోలీసులు దీన్ని గుర్తించలేక పోవడం, వారి సెక్యూరిటీ లోపానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. చంద్రబాబు భద్రత కోసం ఏర్పాటు చేసిన అత్యంత ఖరీదైన లైట్లను ఎత్తుకెళ్లారు. ఈ ఆ మరునాడే విషయాన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది... ఎక్కడ తమ డొల్లతనం బయటపడుతుందోనన్న భయంతో కొత్త లైట్లు ఏర్పాటు చేయాలని ఉండవల్లి పంచాయతీకి ఆదేశాలు జారీ చేశారు. 
 
అయితే అంత విలువైన లైట్లు కొనుగోలు చేసే స్తోమత తమ వద్ద లేదని ఉండవల్లి పంచాయతీ చేతులెత్తేసినా, భద్రతా అధికారులు మరింత ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో కొత్త లైట్లు కొనలేక ఉండవల్లి పంచాయతీ... అద్దె ప్రాతిపదికన లైట్లను తీసుకొచ్చి ఏర్పాటు చేసింది. అయితే అద్దె చెల్లింపులో మాత్రం ఆ పంచాయతీ విఫలమైంది. దీంతో ఆదివారం సదరు లైట్లను అద్దెకు ఇచ్చిన వ్యక్తి అక్కడికి వచ్చి పట్టపగలే లైట్లను విప్పేందుకు ఉపక్రమించాడు. 
 
దీనిని గమనించిన పరిసర రైతులు అతడిని నిలదీయగా... ఆ లైట్లు తనవేనని, అద్దెకు తెచ్చిన పంచాయతీ డబ్బులు చెల్లించకపోవడంతో తీసుకుపోతున్నానని చెప్పాడట. అయినా సీఎం భద్రత కోసం అద్దెకు లైట్లు తీసుకురావాల్సిన అవసరమేమిటన్న కోణంలో రైతులు ఆరా తీయగా, చోరీ విషయం వెలుగుచూసింది.