బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 6 నవంబరు 2019 (21:04 IST)

చంద్రబాబువి దొంగ దీక్షలు.. పవన్‌కల్యాణ్‌ది పిచ్చివాగుడు

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందేలా వారం వారం సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు.

సచివాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్‌తో కలిసి మాట్లాడారు. కులాలు, మతాలు, వర్గాలు, రాజకీయాలకతీతంగా అర్హులైన పేదలందరికీ దళారుల ప్రమేయం లేకుండా సంక్షేమ ఫలాలు పారదర్శకంగా అందజేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

ఇందుకోసం ప్రతి బుధవారం అసెంబ్లీలోని వైఎస్ఆర్ సీపీ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించినున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వరంలో తొలి సమావేశం నిర్వహించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమలులో లోటుపాట్లపై ఈ సమావేశంలో చర్చించామన్నారు.

ఇసుకపైనా సుదీర్ఘంగా సమీక్షించామన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 5 నెలల కాలంలోనే రాష్ట్రంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. దీన్ని భరించలేని విపక్ష నేత చంద్రబాబునాయుడు తనకు అనుకూలమైన ఎల్లో మీడియా సాయంతో జగన్ ప్రభుత్వంపై బురదజల్లే కుట్రకు తెరతీశారన్నారు. 
 
చంద్రబాబువి దొంగదీక్షలు....
పెద్ద కొడుకు పవన్, చిన్న కొడుకు లోకేష్ దీక్షలు విఫలమవ్వడంతో విపక్ష నేత చంద్రబాబు నాయుడు మరో దొంగ దీక్షకు దిగుతున్నారని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాన, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేషన్ విమర్శించారు.

పిచ్చివాడిలా పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారన్నారు. గతంలో ధర్మపోరాటం పేరుతో చంద్రబాబు చేసిన 5, 6 గంటల దీక్షలను ప్రజలు తిరస్కరించారన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అయిదారు రోజుల పాటు కఠోర దీక్షలు చేశారని, అందుకే ప్రజలకు తమ నేతకు బ్రహ్మరథం పట్టారని అన్నారు.

చంద్రబాబునాయుడు ఎందుకు దీక్ష చేస్తున్నారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. దేశంలో ఏ ప్రభుత్వమూ చేపట్టని విధంగా అధికారం చేపట్టిన 4నెలల కాలంలోనే లక్షా 45 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని కొనియాడారు.

రాష్ట్రంలో ఎక్కడా ఒక్క ఆరోపణ లేకుండా ఈ ఉద్యోగాలన్నీ భర్తీ చేశామన్నారు. ఆటో డ్రైవర్లకు ఆసరా, అమ్మఒడి, రైతు భరోసా పథకాలు అమలు చేస్తూ ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. 
 
దోపిడి అరికట్టాడానికే ఇసుక పాలసీ...
గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక దోపిడికి అడ్డుకట్టవేయాలనే ఉద్దేశంతోనే సీఎం వైఎస్ జగన్ ఇసుక పాలసీ తీసుకొచ్చారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, విప్ ఎస్. ఉదయభాను, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్ తెలిపారు. ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా నదుల్లో వరదలొచ్చాయని తెలిపారు.

ఇప్పుడిపుడే వరదలు తగ్గుముఖం పట్టాయని అందరికీ ఇసుక అందజేయాలనే ఉద్దేశంతో ఇసుక వారోత్సవాలు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు. విజయవాడ నగరంలో కావాల్సినంత ఇసుక అందుబాటులో ఉందని, నిర్మాణదారులు తమకు కావాల్సిన ఇసుకను ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకోవొచ్చునని తెలిపారు.   
 
నవంబర్ 6... రాష్ట్ర చరిత్రలో మైలురాయి...
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండేళ్ల కిందట నవంబర్ 6 వ తేదీన చేపట్టిన పాదయాత్ర రాష్ట్ర ప్రజల స్థితిగతులను మార్చేసిన రోజు అని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, విప్ ఎస్. ఉదయభాను, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్ అన్నారు.

గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర మాదిరిగా జగన్ పాదయాత్ర ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా, రాష్ట్ర చరిత్రంలో నవంబర్ ఆరో తేదీ మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు.