శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 11 మార్చి 2020 (06:12 IST)

నాణ్యతతో పిల్లల వస్తువులు : జ‌గ‌న్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్కూల్‌ ఎడ్యుకేషన్‌పై క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  పిల్లలకు ఇచ్చే వస్తువులు నాణ్యతతో ఉండాలని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. పాఠశాలలు తెరిచే నాటికి పంపిణీకి సిద్ధం చేయాలన్నారు. పాఠశాలల్లో నాడు-నేడుపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందన్నారు. నాడు-నేడు తొలి విడతలో భాగంగా 15,715 స్కూళ్లలో సంబంధిత పనులు వేగంవంతంగా పూర్తిచేయాలని ఆదేశించారు.

వచ్చే సమావేశం నాటికి ఏయే దశల్లో పనులు ఉన్నాయో వివరాలు తయారు చేయాలన్నారు. జూన్‌ నాటికి పాఠశాలలు ప్రారంభం అవుతాయి కాబట్టి పనులు పెండింగ్‌లో ఉండకూడదని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత తగ్గకూడదని, స్కూళ్లలో టాయిలెట్లు కూడా పరిశుభ్రంగా ఉండాలని పేర్కొన్నారు. డిజిటల్‌ బోధనకు ప్రతి పాఠశాలకూ స్మార్ట్‌ టీవీ అందజేయాలన్నారు.

గోరుముద్ద మధ్యాహ్న భోజనంపై రూపొందించిన యాప్‌ సక్రమంగా పని చేస్తుందా లేదా అన్న విషయంపై అధికారులను ఆరా తీశారు. గోరుముద్దకు సంబంధించిన బిల్లులు పెండింగులో ఉండకూడదని తెలిపారు. జగనన్న విద్యా కానుక స్కూళ్లు తెరిచేటప్పటికి పిల్లలకు అందించాలన్నారు. జగనన్న విద్యా కానుకలో ఆరు రకాల వస్తువులు .. మూడు జతల యునిఫామ్స్, నోట్‌ పుస్తకాలు, షూ, సాక్స్, బెల్టు, బ్యాగు, టెక్ట్స్ బుక్స్‌.. ఈ కిట్‌లో ఉంటాయి.

ఈ సందర్భంగా యునిఫామ్స్, బెల్టు, బ్యాగుల నమూనాలను అధికారులు సీఎంకు చూపించారు. నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారమే పనులు పూర్తి చేస్తామని అధికారులు పేర్కొన్నారు. వచ్చే సమీక్షా సమావేశం నాటికి ఈ పనుల్లో ప్రగతి కనిపించాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశా నిర్ధేశం చేశారు.