బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (16:38 IST)

ఆన్ లైన్లో సినిమా టికెట్లు అమ్మవచ్చని గత ప్రభుత్వమే నిర్ణయించింది

ప్రభుత్వం సినిమా టికెట్లు అమ్ముతుందంటూ విపక్షం దుష్ప్రచారం చేస్తోంద‌ని మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ఇటీవల కాలంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయాలపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ప్రభుత్వం సినిమా టికెట్లు, మటన్, చేపలు అమ్మడం ఏంటని టీడీపీ అధినేత చంద్రబాబు, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, ఎంపీ రఘురామకృష్ణరాజు వంటి వారు ఈ నిర్ణయాలు ఏకిపారేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించారు.
 
ప్రభుత్వం టికెట్ల వ్యాపారం చేస్తోందని ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. సినిమా టికెట్ల వివాదాన్ని త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. నిర్ణయించిన ధరలకే టికెట్లను ఆన్ లైన్ లో ఉంచుతామని వెల్లడించారు. సినీ ఇండస్ట్రీ పెద్దలు సీఎం జగన్ తో సమావేశమవుతామని కోరారని, ఆగస్టులో భేటీ కావాలని భావించినా కుదరలేదని తెలిపారు. త్వరలోనే సినీ ప్రముఖులు సీఎం జగన్ ను కలుస్తారని పేర్కొన్నారు.  
 
ప్రజలకు మేలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఉద్ఘాటించారు. టికెట్ ధర, అధిక సంఖ్యలో ప్రదర్శనలపై నియంత్రణ విధిస్తూ ఏప్రిల్ 8న జీవో తీసుకువచ్చామని వెల్లడించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే టికెట్లు అమ్మాలని ఆదేశించామని తెలిపారు. ఆన్ లైన్ టికెటింగ్ పై అధ్యయనానికి కమిటీ కూడా ఏర్పాటు చేసినట్టు మంత్రి పేర్ని నాని వివరించారు.
 
కానీ ఆన్ లైన్ టికెటింగ్ పై అర్థంపర్థం లేని విమర్శలు చేస్తున్నారని, ఆన్ లైన్లో టికెట్లు అమ్మవచ్చని గత ప్రభుత్వమే నిర్ణయించిందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ నిర్ణయానికి తెలుగు ఫిలిం చాంబర్ కూడా అంగీకారం తెలిపిందని అన్నారు.