1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (14:22 IST)

నాకు మైకు కూడా ఇవ్వలేదు.. నీకు అదన్నా ఇస్తున్నాం.. సంతోషించు..!

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో చెన్నారెడ్డి నుంచి కోట్ల విజయభాస్కర రెడ్డి వరకు ఎంతోమంది సీఎంలను, నేతలను చూశానని, ఆ కళ్లతో ఇప్పుడీ జగన్‌కు చూడాల్సిన దరిద్రం పట్టిందని బాబు ఫైర్ అయ్యారు. ''మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు మైకు కూడా ఇవ్వలేదు. నీకు అదన్నా ఇస్తున్నాం.. సంతోషించు. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి భరించక తప్పదు'' అని జగన్‌నను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 
 
ఓ ముఖ్యమంత్రిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తనపై మరో రాష్ట్రానికి చెందిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా విచారిస్తుంది? ఆ దమ్మూ, ధైర్యం ఉన్నాయా? నా రాజకీయ జీవితంలో నిప్పులా బతికాను. ఇకపైనా అలానే ఉంటాను. నాపై బురదజల్లితే చూస్తూ ఊరుకునేది మాత్రం లేదు" అని చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ ప్రభుత్వంతో కుమ్మక్కై.. తనతో పాటు తన ప్రభుత్వంపై బురద జల్లేందుకు చూస్తున్నారని చెప్పారు. 
 
ప్రత్యేక హోదా విషయంలో తాను కేంద్రంతో రాజీపడ్డానంటూ వైసీపీ పదే పదే చెప్పడాన్ని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. తానెక్కడా రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. తనకు ఎలాంటి ప్రలోభాలు, బలహీనతలు లేవన్నారు. ఇక రెండేళ్లలో తాను ముఖ్యమంత్రి అవుతానని, ఈ విషయాన్ని తనకు జ్యోతిష్యులు చెప్పారంటున్నారని జగన్‌ను ఉద్దేశించి అంటూ, సీఎం కావాలని పగటికలలు కనొద్దని జగన్‌పై పరోక్షంగా చురక వేశారు. 
 
కేంద్రంతో సన్నిహితంగా ఉండేది తన స్వార్థం కోసం కాదని, కేవలం రాష్ట్రం కోసమేనని చంద్రబాబు తేల్చి చెప్పారు. వాళ్లలా తనపై ఎలాంటి కేసులు లేవని, మంచి కార్యానికి అడ్డుపడటం తప్ప వైసీపీ ఏదైనా మంచిపని చేసిందా? అని బాబు నిలదీశారు.