గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 29 జూన్ 2020 (18:36 IST)

కళాకారులను ఆదుకోవటం పట్ల సిఎం సానుకూల దృక్పధం: యార్లగడ్డ, మన నాయకుడు కూడా...

కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న కళాకారులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ తెలిపారు.
 
కరోనా కష్ట కాలంలో ఉపాధి కోల్పోయిన కళాకారులకు తగిన సాయం చేయాలంటూ సోమవారం తాడేపల్లి సిఎం క్యాంపు కార్యాలయంలో అచార్య యార్లగడ్డ ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి వినతి పత్రం సమర్పించారు. గత ప్రభుత్వం వివిధ రూపాలలో కళాకారులను వాడుకుని ఇప్పటికీ వారికి పారితోషికాలు అందించని విషయాన్ని సైతం ఆయన సిఎం దృష్టికి తీసుకు వచ్చామని ఈ సందర్భంగా యార్లగడ్డ తెలిపారు.
 
లాక్‌డౌన్ కాలంలోనే కాక, అది ముగిసిన తురువాత కూడా నాట్యాచార్యుల మొదలు, కళాకారులు అందరూ తమ ఉపాధిని కోల్పోయారన్నారు. తాజా పరిస్థితులు నేపధ్యంలో కొద్దినెలల పాటైనా కళాకారులకు నిరుద్యోగ భృతి కల్పించవలసిన అవసరం ఉందన్న అంశాన్ని ముఖ్యమంత్రికి వివరించామన్నారు. కళాకారులకు ఇస్తున్న వృద్దాప్య పింఛన్ల సంఖ్యను కూడా పెంచవలసి ఉందన్న అంశంపై జగన్ మోహన్ రెడ్డి మంచి స్పందన కనబరిచారని ఆచార్య యార్లగడ్డ పేర్కొన్నారు.
 
గత ప్రభుత్వం కూచిపూడి నాట్యా శిక్షణా కార్యక్రమం క్రింద 180 మంది నాట్యాచార్యులతో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో శిక్షణ ఇప్పించి, అచార్యులకు వేతనాలు చెల్లించలేదని, మరోవైపు వారి కొనసాగింపుకు కూడా జిఓ విడుదల చేయలేదని, ఈ అంశాలను అన్నింటినీ ముఖ్యమంత్రికి వివరించామన్నారు. ప్రధానంగా కళాకారులు, ప్రజలు, ప్రభుత్వానికి ఉపయోగపడే నూతన సాంస్కృతిక విధాన రూపకల్పన ఆవశ్యకతను కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామన్నారు.
 
 ‘మన నాయకుడు’ పుస్తకావిష్కరణ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం గత సంవత్సర కాలంలో సాధించిన విజయాలపై ‘మన నాయకుడు’ పేరిట రూపొందించిన పుస్తకాన్ని ఈ సందర్భంగా సిఎం ఆవిష్కరించారు. సీనియర్ పాత్రికేయిడు, కెబిఎన్ కళాశాల తెలుగు అధ్యాపకులు రామకృష్ణ దీనిని సంకలనం చేయగా, రాఘవేంద్ర పబ్లిషర్స్ అధినేత రాఘవేంద్రరావు ప్రచురణ భాధ్యతలు నిర్వహించారు. ఆచార్య యార్లగడ్డ మాట్లాడుతూ ప్రభుత్వ విజయాలపై ఈ తరహా పుస్తకాల రూపకల్పన అత్యావశ్యకమని, చెప్పిన హామీలనే కాక, చెప్పని పనులను కూడా చేసి చూపించిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు.