బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 నవంబరు 2022 (09:34 IST)

విద్యుత్ వైర్లు తెగిన ఘటనపై ఏడీఈ, ఏఈ‌, లైన్ ఇన్‌స్పెక్టర్‌పై వేటు

ys jagan
అనంతపురం జిల్లాలో విద్యుత్ వైర్లు తెగి ఆరుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు బాధ్యులుగా భావించి ఏడీఈ, ఏఈ, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌పై వేటు వేసింది. అలాగే, ఘటనకు సంబందించిన సమగ్ర వివరాలతో నివేదిక అందించాలని ఎలక్ట్రికల్ సేఫ్టీ డైరెక్టర్‌ను ఆదేశించింది. 
 
కాగా జిల్లాలోని బొమ్మనహాల్ మండలం, దర్గాహోన్నూరులో పంట కోత పనులకు వెళ్లిన వ్యవసాయ కూలీలు విద్యుదాఘాతంతో మరణించడం పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే, ఈ ప్రమాదంలో చనిపోయిన కూలీల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని అధికారులను ఆయన ఆదేశించారు. 
 
ఈ వ్యవసాయ కూలీలు పంట కోస్తుండగా వర్షం కురవడంతో ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ట్రాక్టర్‌లో ఎక్కారు. ఆ సమయంలో 33 కేవీ విద్యుత్ మెయిన్‌ లైన్ తీగలు తెగి వారిపై పడటంతో ఆరుగురు కూలీలు చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు.