శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 నవంబరు 2021 (17:51 IST)

తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలు ఇప్పించండి : అమిత్ షాకు జగన్ వినతి

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రం చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలను ఇప్పించాల్సిందిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విన్నవించారు. హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో తిరుపతిలో జరుగుతున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ సీఎం జగన్ పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విభజన వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయిందని తెలిపారు. రాష్ట్రం విడిపోయి ఏడేళ్లు దాటినా హామీలు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయని వివరించారు. 
 
పోలవరం ఖర్చు నిర్ధారణలో 2013-14 నాటి ధరల సూచీతో ఏపీకి అన్యాయం జరిగిందని ఆక్రోశించారు. పోలవరం ఖర్చు అంశంలో విభజన చట్టాన్ని ఉల్లంఘించారని సీఎం జగన్ ఆరోపించారు. రాష్ట్రాల మధ్య సమస్యలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని కోరారు. రాస్ట్రాల మధ్య ఏర్పడే సమస్యలకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు.
 
ప్రత్యేక హోదా హామీని కూడా నెరవేర్చలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలు ఇప్పించాలని, తీవ్ర కష్టాల్లో ఉన్న ఏపీ డిస్కంలకు ఉపశమనం కలిగించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తుల పంపకాలు కూడా జరగలేదని నివేదించారు.
 
గత ప్రభుత్వంలో రుణ పరిమితి దాటారని ఇప్పుడు కోతలు విధించడం అన్యాయమని ఎలుగెత్తారు. రుణాల్లో కోతల అంశంపై వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. అటు, రేషన్ లబ్దిదారుల గుర్తింపు ప్రక్రియలో హేతుబద్ధత లోపించిందని, రేషన్ లబ్దిదారుల గుర్తింపు ప్రక్రియలో సవరణలు చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి కోరారు.