శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 4 జూన్ 2019 (10:22 IST)

సూటిగా సుత్తిలేకుండా సీఎం జగన్ సమీక్షలు... అధికారులకు ఇంట్లోనే భోజనాలు

ఏపీ సీఎంగా వైఎస్ జగన్ పాలనలో తనదైన ముద్ర వేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కొత్త సీఎం రివ్యూలు సూటిగా సుత్తి లేకుండా జరుగుతున్నాయని పలువురు అధికారులు పేర్కొంటున్నారు.
 
సోమవారం హెల్త్, ఇరిగేషన్ పైన సమీక్ష చేసిన ముఖ్యమంత్రి ఆరోగ్య శాఖలో 104, 108 వాహనాల పనితీరుపై ఆరా తీశారు. అధికారులు ఏదో సమాధానం చెబుతుండగా ఎన్ని ఉన్నాయో కాదు... ఎన్ని పని చేస్తున్నాయో చెప్పాలంటూ జగన్ అధికారులకు చురకలు అంటించారు.
 
వైజాగ్ మెడ్ టెక్ విస్తరణ పనులు గురించి పూనమ్ మాలకొండయ్యతో మాట్లాడుతూ... ఇదేనా లగడపాటిది అంటూ సెటైర్ వేశారు. పోలవరం గురించి ప్రస్తావిస్తూ డాష్ బోర్డ్ లెక్కలు నాకు చెప్పొద్దని, ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తవుతుందో వాస్తవం చెప్పమని అధికారులు క్లాస్ పీకారు. పోలవరంలో టెండర్ల విషయంలో అక్రమాలు చెప్పిన అధికారులను సన్మానిస్తాననీ, 
వాస్తవాలు చెపితే సమస్యల పరిష్కారం తాను తీసుకుంటానన్నారు జగన్. 

సుదీర్ఘ చర్చలు లేకుండా సాగుతున్న కొత్త ముఖ్యమంత్రి సమీక్షలకు అధికారులు కూడా ఖుషీ అవుతున్నారు. సమీక్షలతో పాటు జగన్ ఇంట్లోనే అధికారులకు భోజనాలు ఏర్పాటు చేయాలని జగన్ ఆదేశాలు ఇవ్వడంతో ఆనందపడుతున్నారు అధికారులు.