మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 4 జనవరి 2019 (08:37 IST)

మనుషులను చంపేస్తున్న బొగ్గుల కుంపటి.. ఎలా?

రెండు తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. ఉదయం 10 గంటలు అయినా బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడిపోతున్నారు. ఈ చలి నుంచి తప్పించుకునేందుకు వెచ్చదనం కోసం బొగ్గుల కుంపట్లు పెట్టుకుంటున్నారు. ఇపుడు ఈ బొగ్గు కుంపట్లే మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. నిద్రపోయే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకుండా బొగ్గుల కుంపటి ఏర్పాటు చేసుకున్నట్టయితే సరిగ్గా 20 నిమిషాల్లో మనిషి ప్రాణాన్ని హరిస్తుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
ఇటీవల సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని శామీర్‌పేట్ బొమ్మరాశిపేట ప్రాంతంలో జరిగిన సంఘటనలో నలుగురు యవకులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీన్ని ప్రాథమికంగా అధ్యయనం చేసిన పోలీసులు, ఫోరెన్సిక్ వైద్యులు ప్రస్తుతం చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. లేదంటే విషాద పరిస్థితులు ఎదుర్కోవడం ఖాయమంటున్నారు. 
 
వెచ్చదనం కోసం ఇరుకు గదుల్లో బొగ్గు కుంపట్లను పెట్టుకొవద్దు. పెద్ద గదుల్లో పెట్టుకున్నా పొగ బయటికి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. చలి గాలి వస్తుందని పొగ వెళ్లకుండా చేస్తే అది ప్రమాదకరమని పోలీసులు, ఫోరెన్సిక్ వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
బొగ్గుల కుంపటి నుంచి వచ్చే పొగ, వేడికి సంబంధించిన వాయువులను బయటికి వెళ్లకుండా చేయడంతో బొమ్మరాశిపేటలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కుంపటి నుంచి వచ్చే కొన్ని వాయువులు ఆక్సిజన్ శాతాన్ని తగ్గించి వేస్తాయి. దీంతో సాధారణంగా శ్వాస తీసుకొనేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. 
 
ఈ బొగ్గుల కుంపటి సంఘటనల్లో కూడా కార్బన్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాైక్సెడ్ వెలువడుతాయి. ఈ రసాయనాలు మెదడులోని శ్వాస నాడీని దెబ్బతీస్తాయి. తర్వాత ఆ రసాయనాలు రక్తనాళాల్లో కలిసిపోవడంతో ప్రాణం పోతుందని ఉస్మానియా మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ వైద్యులు తెలిపారు.