శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PYR
Last Modified: సోమవారం, 26 జనవరి 2015 (07:45 IST)

తిరుపతి బరిలో కాంగ్రెస్... అభ్యర్థిగా శ్రీదేవి పేరు ఖరారు.

పోయిన పరువును దక్కించుకోవడానికి ఇదే సరియైన సమయం.. అని భావించిన కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఉప ఎన్నికలలో పోటీకే రంగం సిద్ధం చేసింది. తమ పార్టీ అభ్యర్థి పేరును కూడా ప్రకటించింది. గెలుపు ఖాయమే అయినప్పటికీ పోలింగ్ తప్పనిసరి కావడం తెలుగుదేశం పార్టీకి పంటి కింద రాయిలా తయారయ్యింది. ఏకగ్రీవమై ఎమ్మెల్యే పదవి నడిచి వస్తుందనుకున్న వారికి కాంగ్రెస్ తో పాటు పలు పార్టీలు తమ అభ్యర్థులను రంగంలోకి దింపి షాకిస్తున్నాయి. 
 
తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతితో సాంప్రదాయాలను పాటిస్తూ, తాము బరిలో నిలవడం లేదని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. అయితే మొదట నుంచి కాంగ్రెస్ పార్టీ మాత్రం తిరుపతిలో పోటీ చేయడానికి ఉత్సాహం చూపుతోంది. తిరుపతిలో గెలుపు సంగతి ఎలా ఉన్నా..పోటీ కారణంగా పార్టీ కాడర్ ను ఒకటి చేయవచ్చునని కాంగ్రెస్ పెద్దలు భావించారు. జరిగిన నష్టంలో కొంతైనా పూడ్చుకోవచ్చునని ఆశించారు. అందులో భాగంగానే తిరుపతి నుంచి పార్టీ అభ్యర్థిని అధిష్టానం ప్రకటించింది. పైగా త్వరలోనే కార్పోరేషన్ ఎన్నికలు రానుండడంతో మరింత బలపడవచ్చునన్నది వారి వ్యూహం. 
 
ఈ మేరకే పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి తమ పార్టీ అభ్యర్థిని ఆర్ శ్రీదేవిగా ప్రకటించారు. శ్రీదేవి తిరుపతి పురపాలక సంఘంలో వార్డు స్థాయి నుంచి వచ్చారు. ఆమె నగరంలో దాదాపు అందరికీ సుపరిచితురాలే. కానీ సుగుణమ్మకు ధీటుగా నిలిచే స్థాయిలో ఉంటుందనడంలో సందేహాలు కాంగ్రెస్ లోనే చాలా మందికి ఉన్నాయి. తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్‌ సిఫార్సు మేరకే ఆమెకు టికెట్టు కేటాయించారు. తన అనుచరురాలు, డ్వాక్రా సంఘం నాయకురాలు ఆర్.శ్రీదేవి పేరును అధిష్టానానికి సూచించారు.
 
ఇదిలా ఉంటే తిరుపతి ఉప ఎన్నికల బరిలో లోక్ సత్తా తమ అభ్యర్థిని నిలిపింది. అలాగే భారతీయ జనసంఘ్, జనతాదళ్-యు, స్వతంత్ర అభ్యర్థులు అందరూ కలిపితే 16 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ వస్తే పోటీ అనివార్యమవుతుంది.