శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (09:18 IST)

జయలలిత మరణం వెనుక కుట్ర... వైద్యుల ప్రెస్‌మీట్‌లో పొంతనలేని సమాధానాలు?

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంలో కుట్ర ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. దీనికి అపోలో ఆస్పత్రులతో కలిసి లండన్ వైద్య నిపుణులు డాక్టర్ రిచర్డ్ బాలే నోటి వెంట జాలువారిన పదాలే కారణంగా చెప్పుకోవచ్చు

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంలో కుట్ర ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. దీనికి అపోలో ఆస్పత్రులతో కలిసి లండన్ వైద్య నిపుణులు డాక్టర్ రిచర్డ్ బాలే నోటి వెంట జాలువారిన పదాలే కారణంగా చెప్పుకోవచ్చు. జయలలిత గత యేడాది డిసెంబర్ 5వ తేదీ రాత్రి కన్నుమూశారు. అయితే ఆమె మృతిపై ఇప్పటికీ ఎన్నో అనుమానాలున్నాయి. ఆమె మరణం అనంతరం ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరు ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చాయి. జయలలిత దాదాపు 70 రోజులకు పైగా ఆసుపత్రిలో ఉన్నారు. జయ ఆసుపత్రిలో ఉన్న సమయంలో శశికళ తప్ప ఆమె వద్ద ఏ సన్నిహితులు లేరు. జయ మేనకోడలు దీపను కూడా కనీసం చూడటానికి కూడా అనుమతించని పరిస్థితి.
 
దీంతో ఆసుపత్రి సిబ్బందితో పాటు శశికళపై కూడా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంపై అపోలో డాక్టర్లు సందేహాలను నివృత్తి చేయాలని ప్రజల నుంచి డిమాండ్ వచ్చింది. అయితే అపోలో డాక్టర్లు ఉన్నట్టుండి నిన్న ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. జయలలిత చనిపోయి రెండు నెలలు దాటి పోతుంటే శశికళ సీఎంగా ఖరారైన సమయంలోనే, ఇన్నాళ్లు లేనిది ఇంత హడావుడిగా ప్రెస్‌మీట్ ఎందుకు ఏర్పాటు చేశారనే ప్రశ్న తలెత్తుతోంది.
 
పైగా, ఈ ప్రెస్‌మీట్‌లో వైద్యులు వెల్లడించిన విషయాలు, వాస్తవంగా జరిగిన పరిణామాలకు ఏమాత్రం పొంతనలేదు. జయలలిత చికిత్స పొందుతున్న సమయంలో చివరకు కేంద్ర మంత్రులు, గవర్నర్‌ను కూడా తిలకించేందుకు అనుమతించలేదు. అలాంటిది గవర్నర్ విద్యాసాగర్ రావుకు అపోలోకు రెండోసారి వెళ్లినప్పుడు ఆమె చికిత్స పొందుతున్న గదిలో నుంచి బొటనవేలితో కోలుకుంటున్నట్టు విజయ సంకేతం చూపారని డాక్టర్లు తెలిపారు. అయితే ఆ సమయంలో గవర్నర్ అపోలోకు వెళ్లిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనను లోపలికి అనుమతించలేదని చెప్పారు. ఆయన ఆమె చికిత్స పొందుతున్న గది వైపు వెళ్లకుండానే జయ విజయ సంకేతం చూపారని డాక్టర్లు చెప్పడంలో ఆంతర్యమేంటో తెలియడం లేదు.
 
అలాగే, వైద్యులు చెప్పిన విషయాల్లో జయలలిత వైద్య ఖర్చులకు సంబంధించిన అంశం చర్చనీయాంశమైంది. జయలలిత మెడికల్ బిల్లు రూ.5.5 కోట్లు‌గా డాక్టర్లు చెప్పారు. ఆ బిల్లును ఆమె కుటుంబ సభ్యులకు అందజేశామని తెలిపారు. అయితే ఆసుపత్రిలో శశికళ తప్ప జయ కుటుంబ సభ్యులు ఎవరినీ లోపలకు అనుమతించలేదు. మరి అలాంటప్పుడు ఆ బిల్లు కుటుంబ సభ్యులకు ఎలా ఇచ్చారనే ప్రశ్న తలెత్తుతోంది.
 
జయలలిత చికిత్స పొందుతున్నంతకాలం శశికళను తప్ప ఆసుపత్రిలోకి కనీసం జయలలిత సొంత మనుషులను కూడా రానివ్వకపోవడంపైనే అన్ని అనుమానాలు. తన ముఖ్యమంత్రి పదవికి ముప్పు రాకూడదనే ఉద్దేశంతోనే శశికళ ఈ ప్రెస్‌మీట్ డ్రామాను నడిపించిదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.