ఏపీలో కరోనా తాండవం.. ఒక్క రోజులో 7948 మందికి పాజిటివ్..58 మంది మృతి
ఏపీలో కరోనా తాండవం చేస్తోంది. కరోనా కేసుల తాజా బులెటిన్ విడుదలయ్యింది. గత 24 గంటల్లో 62వేల 979 శాంపిల్స్ పరీక్షించగా 7948 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
3064 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా కారణంగా 58 మంది చనిపోయారు. తాజా గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు మొత్తం 1148 మంది మరణించారు.
రాష్ట్రంలో మొత్తం 1,07,402 పాజిటివ్ కేసులకు గాను.. 49,745 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరో 56,509 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నారు.
ప్రభుత్వం చేతులెత్తేసింది: చంద్రబాబు
రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరిగాక ప్రభుత్వం చేతులెత్తేసిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. గుంటూరు జీజీహెచ్‌లో మృతదేహాలు పేరుకుపోయిన పరిస్థితులు బాధాకరమన్నారు.
వైరస్ ప్రభావం మృతదేహాలపై ఎంతసేపు ఉంటుందో అధ్యయనం చేసి ప్రోటోకాల్ ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా సోకిన వ్యక్తిని మున్సిపాలిటీ వాహనంలో ఆస్పత్రికి తరలించటం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలు ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటిస్తూ... ధైర్యంగా ఉంటే విపత్తును ఎదుర్కోవచ్చని చంద్రబాబు అన్నారు. వ్యాక్సిన్ వచ్చే వరకు అప్రమత్తత తప్పదన్నారు.
రోగనిరోధక శక్తి పెంచుకోవడం సహా... మద్యం, ఇతర వ్యసనాలు మానేయాలని సూచించారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దన్నారు. హోం క్వారంటైన్, టెలీ మెడిసిన్‌పై మరింత అవగాహన పెంచాలని చంద్రబాబు అన్నారు.