ఏపీలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ.. 332 సెంటర్లు సిద్ధం
ఏపీలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా 332 సైట్లను ఏర్పాటు చేశారు. మంగళవారమే సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి విజయవాడకు వ్యాక్సిన్ చేరింది. ఇందులో రాష్ట్రానికి 4 లక్షల 77వేల వ్యాక్సిన్ డోసులు వచ్చాయి. అక్కడి నుంచి పటిష్ట భద్రత మధ్య జిల్లాలకు తరలిస్తున్నారు. ఈ నెల 16న వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ సమీక్ష జరిపారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు, దిశానిర్దేశం చేశారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం వ్యవహరించాలని అధికారులకు సీఎస్ సూచించారు. టీకా పంపిణీకి రాష్ట్రవ్యాప్తంగా 332 సైట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. గర్భిణులు, 18 ఏళ్లలోపు, 50 ఏళ్లు పైబడిన, జబ్బులతో ఇబ్బందిపడేవారికి వ్యాక్సిన్ వేయడం లేదని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.