శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 అక్టోబరు 2020 (18:48 IST)

ఏపీలో ఏడు లక్షలు దాటిన కరోనా కేసులు.. 41 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఏడు లక్షలు దాటింది. 24 గంటల వ్యవధిలో ఏపీలో 6751 కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 700235కు చేరింది. అలాగే, రాష్ట్రంలో 24 గంటల్లో 41 మంది కరోనాతో మృతి చెందారు. 
 
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 986 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో 888, ప్రకాశం 783, పశ్చిమ గోదావరి 753, గుంటూరు 594, నెల్లూరు 472, కృష్ణా 424, కడప 400, అనంతపురం 333, శ్రీకాకుళం 301, విశాఖపట్నం 277, విజయనగరం 275, కర్నూలు 265 కరోనా కేసులు నమోదయ్యాయి.
 
రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 700235 కాగా, వారిలో 636508 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 57858 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 7297 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో ఏపీలో 71,577 కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 58,78,135 కరోనా శాంపిల్స్ టెస్ట్ చేసినట్టు ప్రభుత్వం తెలిపింది.
 
తెలంగాణలో ఇప్పటి వరకు 1,93,600 మంది కరోనా బారిన పడ్డారు. ఒక్క సెప్టెంబరు నెలలో మొత్తం 65,903 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా 68,247 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అంటే కొత్త కేసుల కంటే రికవరీల సంఖ్యే ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1135 మరణించగా.. ఒక్క సెప్టెంబరు నెలలోనే 299 కరోనాతో మృతి చెందారు.