శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 జనవరి 2021 (09:59 IST)

సంక్రాంతి నుంచి కరోనా వ్యాక్సినేషన్ : తెలంగాణాలో 1500 కేంద్రాలు

దేశంలో సంక్రాంతి పండుగ నుంచి కరోనా టీకీల వినియోగం జరుగనుంది. ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. అన్నీ సజావుగా జరిగితే జనవరి 13 నుంచి దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 
కరోనా వ్యాక్సిన్లకు డీసీజీఐ అత్యవసర అనుమతులు ఇచ్చిన 10 రోజుల్లోగా పంపిణీ ప్రారంభించాలని భావిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ, ఇటీవల నిర్వహించిన 'డ్రై రన్' ప్రక్రియ నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. 
 
భారత్‌లో కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీలో కీలకపాత్ర పోషిస్తున్న భారత్ బయోటెక్, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పటికే సంయుక్తంగా తమ సన్నద్ధతను వెల్లడించడం కేంద్రం ప్రకటనకు బలం చేకూర్చుతోంది. కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్లకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఈ నెల 3న అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేసిన విషయం తెల్సిందే. 
 
దీంతో వ్యాక్సిన్‌ల పంపిణీకి కేంద్ర ఆరోగ్యశాఖ, రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాయి. వ్యాక్సిన్ పంపిణీకి తెలంగాణలో 1,500 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రజారోగ్యశాఖ చెప్పింది. మొద‌ట‌ వైద్యారోగ్యశాఖ సిబ్బందికి తొలివిడుత టీకాలు వేస్తామని చెప్పింది.
 
అయితే, రెండు డోసులు వేసుకొంటేనే కరోనా వైరస్‌ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా చెప్పారు. రెండో డోసు వేసుకున్న అనంత‌ర‌మే క‌రోనా నుంచి పూర్తి రక్షణ కల్పించేలా యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయన్నారు. క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలోనే దేశంలో వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చార‌ని ఐసీఎంఆర్ సంచాల‌కుడు బల్‌రామ్‌ భార్గవ తెలిపారు.