శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 ఏప్రియల్ 2020 (20:44 IST)

ఏపీలో 'కోవిడ్ వారియర్స్'... 2 వేల మంది వైద్య విద్యార్థులు చేరిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ.. ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టపడటం లేదు. ముఖ్యంగా, కర్నూలు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాలు కరోనా హాట్‌స్పాట్‌లుగా ఉన్నాయి. 
 
ఈ నేపథ్యంలో రోగుల సంఖ్య మరింత పెరిగితే వైద్యులు, ఇతర సిబ్బంది కొరత రాకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తాజాగా, 'కొవిడ్ వారియర్స్' పేరిట ఓ వైద్య బృందాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ బృందంలో ఇప్పటివరకు 2000 మంది వైద్య విద్యార్థులు, అప్రెంటిస్లు చేరారు. వారేకాకుండా, ప్రైవేటు వైద్యులు, నర్సుల సేవలు కూడా ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. 
 
ఇదే అంశంపై కోవిడ్ 19 స్పెషల్ ఆఫీసర్ గిరిజా శంకర్ స్పందిస్తూ, రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో వైద్య సిబ్బంది అవసరం ఉందని, అందుకే 271 మెడికల్ కాలేజీలు, డెంటల్ కాలేజీలు, ఆయుర్వేదిక్, యునానీ కాలేజీల నుంచి స్వచ్ఛందంగా ముందుకొచ్చేవారి కోసం ఈ 'కొవిడ్ వారియర్స్' పథకం తీసుకువచ్చామన్నారు. 
 
కేవలం వైద్య విద్యార్థులేకాదు వైద్య విద్యార్థులే కాకుండా, ఆసక్తివున్న మెడికల్ ప్రాక్టీషనర్లు, స్పెషలిస్టులు, నర్సింగ్ కోర్సులు పూర్తిచేసినవారు, ఇతర పారామెడికల్ సిబ్బంది ఎవరైనా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని సూచించారు.
 
ఈ మెడికల్ వలంటీర్లలో అనుభవం ఉన్నవారిని కరోనా ఆసుపత్రుల్లో వినియోగించుకుంటామని, వైద్య విద్యార్థులను క్వారంటైన్ సెంటర్లలో నియమిస్తామని తెలిపారు. వారికి కొవిడ్-19 పేషెంట్లకు ఎలా చికిత్స అందించాలో శిక్షణ ఇస్తామని గిరిజా శంకర్ వివరించారు. వైద్య వలంటీర్లుగా పని చేసేందుకు ముందుకువచ్చేవారి ప్రయాణ ఖర్చులు, ఆహార భత్యాలు భరిస్తామని, వారికి పీపీఈ కిట్లు కూడా అందిస్తామని ఆమె వెల్లడించారు.