శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 మార్చి 2022 (16:12 IST)

ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ రైతులకు విజ్ఞప్తి .. సీఆర్డీఏ అధికారుల తిప్పలు

రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రైతులను అత్యంత హీనంగా చూసిన సీఆర్డీఏ అధికారులు ఇపుడు రైతుల చుట్టూ తిరుగుతున్నారు. వారికి ఫోన్లు చేస్తున్నారు. మీ ఫ్లాట్లు రిజిస్టర్ చేస్తాం రండి మహాప్రభో అంటూ కాళ్లావేళ్లా పడుతున్నారు. దీనికంతటికీ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానమైన హైకోర్టు ఇచ్చిన తీర్పే. 
 
ఏపీ రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలంటూ ఏపీ సర్కారును హైకోర్టు ఇటీవల ఆదేశించింది. నెల రోజుల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, ప్లాట్లను అభివృద్ధి చేసి మూడు నెలల్లో రైతులకు అప్పగించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. 
 
మరోవైపు, రైతులకు సీఆర్డీఏ అధికారులు ఫోన్లు చేసి రమ్మని ప్రాధేయపడుతున్నారు. మీకు కేటాయించి ప్లాట్లను రిజిస్టర్ చేసుకోండంటూ వజ్ఞప్తి చేస్తున్నారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం గత ప్రభుత్వం 28,587 మంది రైతుల నుంచి 34,385 ఎకరాలను భూములను సేకరించింది. ఒప్పందం ప్రకారం భూములు ఇచ్చిన రైతులకు నివాస, వాణిజ్య ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వాలి. 
 
ఈ క్రమంలో రైతులకు 64,735 ప్లాట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో 38,282 నివాస ప్లాట్లు, 26,453 వాణిజ్య ప్లాట్లు ఉన్నాయి. వీటిలో 40,378 ప్లాట్లను గత తెదేపా ప్రభుత్వ హయాలంనే రిజిస్టర్ చేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిగా నిలిపివేశారు. ఇపుడు హైకోర్టు తీర్పుతో అధికారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని రైతులను కోరుతున్నారు.