ఏపీలో కరోనా కర్ఫ్యూ నిబంధనల్లో సడలింపులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమల్లో వున్న కరోనా కర్ఫ్యూలో మరిన్ని సడలింపులు ఇచ్చారు. ఈ మేరకు కరోనాపై మంత్రులు ఆళ్ల నాని, బొత్స సత్యనారాయణతో పాటు పలువురు అధికారులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిర్ణయించారు.
రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఒకే విధంగా కర్ఫ్యూ నిబంధనల అమలు చేయనున్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు కొనసాగించాలని నిర్ణయించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ ఉండబోదు. రాత్రి 9 గంటలకు అన్ని దుకాణాలు మూసి వేయాల్సి ఉంటుంది.
దుకాణాల్లో సిబ్బందితో పాటు కొనుగోలుదారులు మాస్కులు ధరించడం తప్పనిసరి చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే దుకాణాలకు భారీ జరిమానా విధించనున్నారు. ప్రజలు మాస్కులు ధరించకపోతే రూ.100 జరిమానా నిబంధనను ఖచ్చితంగా అమలు చేయనున్నారు.