మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 17 డిశెంబరు 2018 (08:37 IST)

పెను తుఫానుగా మారిన పెథాయ్.. 7 జిల్లాల్లో అప్రమత్తం

పెథాయ్ పెను తఫానుగా మారి దూసుకొస్తోంది. ఇది కాకినాడ వద్ద సోమవారం తీరందాటే అవకాశం ఉంది. ఫలితంగా ఏడు జిల్లాల యంత్రాంగాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ప్రధానంగా కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు పెథాయ్ తుఫాను ముప్పు పొంచివుంది. ఇప్పటికే ఈ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. 
 
ఈ పెథాయ్ తుఫాను పరిస్థితిని ఎప్పటికపుడు సమీక్షించడానికి కంట్రోల్‌రూమ్‌లను ఏర్పాటు చేశారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక బృందాలతో పాటు విద్యుత్తు శాఖకు చెందిన రెండువేల మందిని మోహరించింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆరుగురు జాలర్లు సముద్రంలో చిక్కుకున్నారు. వారిని హెలికాఫ్టర్ల ద్వారా సురక్షితంగా తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. 
 
గంటకు 28 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న తుఫాను తీరందాటే సమయంలో గాలుల వేగం గంటకు వంద కిలోమీటర్లకు చేరడంతో పాటు.. 22 మండలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అక్కడి ప్రజలను సురక్షితప్రాంతాలకు తరలించాలని జిల్లాల కలెక్టర్లకు స్పష్టంచేసింది. సీఎం చంద్రబాబు ఆదివారం కలెక్టర్లు, అధికారులతో తుపాను పరిస్థితిపై సమీక్షించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. 
 
కాకినాడలో, భీమిలిల్లో ఏడో నంబరు, విశాఖపట్ణం, గంగవరంలో ఆరో నంబరు, నిజాంపట్నం, మచిలీపట్నంలో ఐదో నంబరు, కళింగపట్నం, కృష్ణాలో మూడో నంబరు ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. ఈ పెథాయ్ తుఫాను తీరం దాటే సమయంలో గాలుల వేగం గంటరు 100 కిలోమీటర్ల మేరకు ఉంటాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.