1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 3 అక్టోబరు 2019 (08:25 IST)

దండి యాత్ర ఓ చారిత్రాత్మక సంఘటన: గవర్నర్

అలనాటి స్వాతంత్ర్య ఉద్యమంలో దండి యాత్ర ఒక చారిత్రాత్మక సంఘటనగా నిలిచిందని, మహాత్మా గాంధీజీ ఉప్పు పన్నుకు వ్యతిరేకంగా ఎంచుకున్న ఈ కార్యక్రమం బ్రిటీష్ పాలకులు గుండెళ్లో రైళ్లు పరిగెత్తించిందని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ అన్నారు.

తెల్ల పాలకుల దుర్మార్గపు నిబంధనలకు నిరసనగా అహ్మదాబాద్‌లోని తన ఆశ్రమం నుండి గుజరాత్‌లోని సముద్రతీర గ్రామమైన దండి వరకు 241 మైళ్ల పూర్తి దూరం ప్రయాణించాలని నిర్ణయించుకున్న మహాత్మా గాంధీ 1930 మార్చి 12 న దండి యాత్రకు పూనుకున్నారన్నారు.  రాజ్ భవన్‌లోని దర్బార్ హాల్‌లో బుధవారం మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.

భారత పరిశ్రమల సమాఖ్య యంగ్ ఇండియన్స్ అమరావతి చాప్టర్ భాగస్వామ్యంతో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ బిస్వ భూషన్ జాతి పితకు ఘనంగా నివాళి అర్పించారు నాటి దండి యాత్రకు గుర్తుగా సిఐఐ యంగ్ ఇండియన్స్ రూపొందించిన నమూనా దండి విజయవాడ చేరుకోగా బిశ్వభూషన్ దానిని స్వాగతించారు.

దక్షిణ భారత దేశ వ్యాప్తంగా అన్ని ముఖ్య పట్టణాలలోనూ దీనితో ప్రయాణీస్తున్న సిఐఐ ప్రతినిధులు విజయవాడ నుండి విశాఖ మీదుగా దీనిని డిల్లీ చేర్చనున్నారు. మరోక నమూనా దండి, ఉత్తర భారత దేశంలో తిరుగుతుండగా, ఈ రెండింటికీ భారత ప్రధాని స్వాగతించనున్నారు. ఈ సందర్భంగా గౌరవ గవర్నర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ 150వ జయంతిని ఒక్క భారతదేశంలోనే కాక, ప్రపంచమంతటా జరుపుకోవటం ఆయన గొప్పతనానికి నిదర్శనమన్నారు.

గాంధీజీ తన 61 సంవత్సరాల వయస్సులో దండి యాత్రకు నాయకత్వం వహించారని దానిని మనమంతా గుర్తు చేసుకోవాలని సూచించారు. ఆ సందర్భంగా గాంధీజీ మాటలను గుర్తు చేసుకున్న మాననీయ గవర్నర్, అమర్‌నాథ్, బద్రి-కేదార్ నాధ్  యాత్రకు మించిన పవిత్ర తీర్థయాత్రగా గాంధీజీ దండి యాత్రను ప్రస్తుతించారన్నారు. 

దండి కవాతు చివరికి ఏప్రిల్ 5, 1930న ముగియగా,  ఏప్రిల్ 6న ఉదయం 8.30 గంటలకు గాంధీజీ దండి వద్ద ఉప్పు ముద్దను తీసుకొని బ్రిటీష్ పాలకుల ఉప్పు చట్టాన్ని ధిక్కరించారని వివరించారు. స్వాతంత్య్ర ఉద్యమం యొక్క జ్వాలలను మండించి, సామూహిక శాసనోల్లంఘన ఆలోచనను దేశవ్యాప్తంగా కార్చిచ్చు వలే వ్యాపింప చేయటానికి దండి యాత్ర కారణమైందన్నారు. 

మహాత్మా గాంధీ సత్యంపై విశ్వాశాన్ని ఉంచారని దాని ద్వారానే భరత జాతికి న్యాయం జరిగేలా ప్రపంచాన్ని ప్రేరేపించారన్నారు. అహింసతో శాంతిని నెల్పే క్రమంలో తన ఆదర్శాలకు వ్యతిరేకించిన వారిని కూడా ప్రేమించిన గొప్ప మహాత్ముడు గాంధీజీ అని బిశ్వ భూషన్ హరి చందన్ అన్నారు. మహాత్ముడు ఏ సూత్రాల ప్రాతిపదికన తన జీవితాన్ని త్యాగం చేసారో,  ఆ ఆదర్శాలకు కట్టుబడి ఉంటామని మనమందరం ప్రతిజ్ఞ చేయాల్సిన సమయం ఇదేనని గవర్నర్ తెలిపారు.

కార్యక్రమంలో సిఐఐ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ఉపాధ్యక్షులు రామకృష్ణ , వెంకటేశ్వరరావు, పూర్వపు అధ్యక్షులు డాక్టర్ లక్ష్మి ప్రసాద్, సిఐఐ యంగ్ ఇండియన్స్ విభాగ ఛైర్మన్ సాత్విక్, సహ ఛైర్మన్ తేజ, సందీప్ మండవ, లీనా చౌదరి , తరుణ్ కాకాని, గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, సంయిక్త కార్యదర్శి అర్జున రావు, ఎడిసి మాధవ రెడ్డి పాల్గొన్నారు.
 
గాంధీ శతకం ఆవిష్కరణ...
గాంధీ జయంతి వేడుకలలో భాగంగా మంగిపూడి వేంకట శర్మ రచించిన గాంధీశతకం పుస్తకాన్ని గవర్నర్  బిశ్వభూషన్ హరిచందన్ అవిష్కరించారు. అచార్య బూదాటి వెంకటేశ్వర్లు పుస్తక వ్యాఖ్యానం చేశారు.