శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 31 మే 2017 (03:52 IST)

చిత్రసీమ పెద్దాయన కడసారి చూపు కోసం తరలి వస్తున్న చిత్రసీమ ప్రముఖులు

తెలుగు చిత్ర పరిశ్రమ మేరుపర్వతం సెలవు తీసుకుంది. అనారోగ్యంతో నెలల తరబడి తలపడి పోరాడిన దిగ్గజ దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు ఇక చాలు అంటూ కన్ను మూశారు. ఆ వార్త తెలియగానే యావత్ చిత్ర పరిశ్రమ, రాజకీయరంగాలు దిగ్భ్రాంతి చెందాయి. 45 సంవత్సరాల సినీజీవితంలో

తెలుగు చిత్ర పరిశ్రమ మేరుపర్వతం సెలవు తీసుకుంది. అనారోగ్యంతో నెలల తరబడి తలపడి పోరాడిన దిగ్గజ దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు ఇక చాలు అంటూ కన్ను మూశారు. ఆ వార్త తెలియగానే యావత్ చిత్ర పరిశ్రమ, రాజకీయరంగాలు దిగ్భ్రాంతి చెందాయి. 45 సంవత్సరాల సినీజీవితంలో వేలమంది కళాకారులకు జీవితాన్ని ఇచ్చిన మానవతా మూర్తి దాసరి కన్నుమూసిన వార్త తెలుగు సమాజాన్ని, ప్రజలను కదిలించి వేసింది. యావత్ చిత్ర ప్రముఖులు హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో ఉన్న దాసరి స్వగృహానికి తరలి వచ్చి కడసారి దర్శించుకుంటున్నారు. 
 
దర్శక నిర్మాత దాసరి నారాయణరావు (75) భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌ లోని ఆయన ఇంటికి తరలించారు. తీవ్ర ఆనారోగ్యంతో గత కొన్ని రోజులుగా సతమతమవుతున్న దాసరి వారం రోజుల కిందట మరోసారి కిమ్స్‌‌లో చేరి అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం తర్వాత గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. దాసరి మరణవార్త తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. దాసరి భౌతికకాయాన్ని సందర్శించేందుకు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఆయన ఇంటికి తరలివస్తున్నారు. దాసరితో వారికి ఉన్న అనుబంధాన్ని షేర్‌ చేసుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. 
 
దర్శకరత్న దాసరి మృతి ఇండస్ట్రీకి తీరనిలోటని, ఆయన లేరన్న నిజాన్ని జీర్ణించుకోలేక పోతున్నామంటూ టాలీవుడ్‌ ప్రముఖులు వాపోతున్నారు. విక్టరీ వెంకటేశ్‌, డా. రాజశేఖర్‌, జీవిత, నిర్మాతలు సురేష్‌ బాబు, అశోక్‌, దర్శకులు బోయపాటి శ్రీను, సుకుమార్‌, విజయశాంతి, హేమ, అలీ, సనీ ఆర్టిస్టులు, బుల్లితెర నటులు దాసరి భౌతికకాయాన్ని దర్శించుకుని నివాళులర్పిస్తున్నారు. రేపు సాయంత్రం నాలుగు గంటలకు మొయినాబాద్‌లో ప్రభుత్వ లాంచనాలతో దాసరి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
 
జనవరిలో తీవ్ర అస్వస్థతకు లోనై నెలల తరబడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందిన దాసరి మే 17న మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. గత పదిరోజులుగా కిమ్స్ ఆసుపత్రిలో ఉన్న దాసరికి మంగళవారం కూడ సర్జరీ జరిగినట్లు తెలుస్తోంది. కానీ దేహం తట్టుకోలేకపోవడంతో మంగళవారం సాయంత్రం 7 గంటలకు ఆసుపత్రిలో దాసరి కన్నుమూశారు.