గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: సోమవారం, 19 జులై 2021 (11:21 IST)

ఎమ్మెల్యే గ‌ద్దెకు పోటీగా దేవినేని ప‌రిష్కార వేదిక‌

ప్రజల సమస్యల పరిష్కారం కోసం జగనన్న బాటలో పరిష్కార వేదిక నిర్వ‌హిస్తున్న‌ట్లు వైసీపీ విజ‌య‌వాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్ చెప్పుకొచ్చారు. ఈ నియోజ‌క‌వ‌ర్గానికి తెలుగుదేశం ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ రావు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.

అయితే, గుడివాడ‌లో టీడీపీ త‌ర‌ఫున నిల‌బ‌డిన‌ దేవినేని అవినాష్, మంత్రి కొడాలి నాని చేతిలో ఓట‌మి పాల‌య్యారు. తిరిగి ఆయ‌న టిడిపి నుంచి వైసీపీలో చేరి, విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం ఇన్ చార్జి అయ్యారు. ఇపుడు ఎమ్మెల్యే గ‌ద్దెకు పోటీగా దేవినేని ప‌రిష్క‌ర వేదిక‌ను ఏర్పాటు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.
 
సీఎం జగన్ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నార‌ని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నార‌ని దేవినేని అవినాష్ త‌న ప‌రిష్కార వేదిక‌లో పేర్కొన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి లబ్ధిదారునికి పథకాలు సక్రమంగా చేరుతున్నాయ‌ని, ప్రజలకు ఏ సమస్య ఉండకూడదనే లక్ష్యం తో ఈ పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామ‌న్నారు. 

వాలంటీర్ వ్యవస్థ ద్వారా పరిష్కారం కానీ సమస్యలు ఏమైనా ఉంటే, అధికారుల‌ దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కారం చేస్తున్నామ‌ని చెప్పారు. సమస్యలు లేని నియోజకవర్గంగా విజ‌య‌వాడ తూర్పు నియోజకవర్గాన్ని త‌యారు చేయడమే తన‌ లక్ష్యం అంటున్నారు...దేవినేని అవినాష్. మ‌రి దీనికి స్థానిక ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ రియాక్ష‌న్ ఏంటో వేచి చూడాలి.