మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 3 జులై 2020 (16:18 IST)

వైఎస్సార్‌లో వై అంటే వైవీ.సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి, దోచుకోమనీ...

కొల్లు రవీంద్ర పేరును కుట్రపూరితంగానే మచిలీపట్నం హత్యకేసులో చేర్చారని, బీసీ నేతలను లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

ముఖ్యమంత్రి కనుసన్నల్లో తాడేపల్లి రాజప్రాసాదం నుంచే సజ్జల నాయకత్వంలో టీడీపీ నాయకులపై వేధింపులు కొనసాగుతున్నాయన్నారు. ప్రజా రాజధాని అమరావతి ఉద్యమం 200రోజులకు చేరిందని, రైతులు, రైతుకూలీలు, మహిళలు ప్రభుత్వ వేధింపులను తట్టుకొని ఉద్యమంలో నిలిచారన్నారు.

ఉద్యమానికి సంఘీభావంగా టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరిగే కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ప్రభుత్వం కొల్లు రవీంద్ర పేరును హత్యకేసులో తెరపైకి తీసుకొచ్చిందన్నారు. బాధ్యత గల రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన బీసీ  నేతలపై ప్రణాళిక ప్రకారమే ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందన్నారు.

అచ్చెన్నాయుడి బెయిల్ పిటిషన్ కోర్టులో ఉండగానే ఆయన్ని బలవంతగా డిశ్చార్జి చేసి, విజయవాడ సబ్ జైలుకు తరలించారని, ఆయన ఆరోగ్యం బాగోలేకపోయినా ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందన్నారు. సజ్జల నిర్దేశకత్వంలోనే ఇదంతా జరిగిందని దేవినేని చెప్పారు.

విశాఖలో అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు పెట్టారని, విజయనగరంలో అశోక్ గజపతి రాజు కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. తూర్పుగోదావరిలో యనమల రామకృష్ణుడు, చినరాజప్పలపై, పితాని సత్యనారాయణపై తప్పుడు కేసులు నమోదు చేశారన్నారు. కృష్ణాజిల్లాలో కొల్లు రవీంద్రను హత్యకేసులో ముద్దాయిగా ఇరికించాలని చూస్తున్నారన్నారు.

మచిలీపట్నంలో జరిగిన హత్య పాతకక్షల వల్ల జరిగిందని తెలిసికూడా రవీంద్రను ఇరికించాలని చూడటం న్యాయం కాదన్నారు. రాజకీయ కుట్రలో భాగంగా నాయకులపై తప్పుడు కేసులు పెడుతూ, టీడీపీలోని బలమైన నేతలపై పథకం ప్రకారమే ప్రభుత్వం కేసులుపెడుతోంద న్నారు. వైఎస్సార్ లో వై. అంటే వై.వీ.సుబ్బారెడ్డి అని, ఎస్ అంటే  సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డని, ఈ ముగ్గురునీ దోచుకోమని చెప్పి జగన్ రాష్ట్రంపైకి వదిలేశాడన్నారు. 

13 జిల్లాల్లో ల్యాండ్, శాండ్, మైనింగ్, వైన్స్ మాఫియాల తర్వాత ఇళ్లస్థలాల ముసుగులో నేలచదును పేరుతో,  కోట్లాదిరూపాయలు దండుకుంటున్నారని దేవినేని మండిపడ్డారు. చంద్రబాబునాయుడిని ఎలా తిట్టాలి, టీడీపీ వారిపై ఏం కేసులు పెట్టాలన్న కృతనిశ్చయంతోనే సజ్జల తాడేపల్లి రాజప్రాసాదంలో కూర్చొని పనిచేస్తున్నాడన్నారు.

నేతిబీరలో నెయ్యి ఎంతుంటుందో, వైసీపీలో సామాజిక న్యాయం కూడా అలానే ఉంటుందన్నారు. లక్ష కోట్ల దోపిడీకి పాల్పడిన జగన్ అవినీతిపై ఎర్రన్నాయుడు, అశోక్ గజపతి రాజు కేసులు వేశారని, నేడు వారి కుటుంబసభ్యులను వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. గడచిన ఐదేళ్లు హైదరాబాద్ లో కూర్చొని కుట్రలు, కుతంత్రాలు నడిపిన జగన్, ఆనాడున్న ముఖ్యమంత్రిపై, మంత్రులపై దారుణంగా దుష్ర్పచారం చేశారన్నారు.

రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న జగన్, నేడు రాజ్యాంగవ్యవస్థలపై, న్యాయవ్యవస్థలపై దాడి జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉంటున్నాడని ఉమా ప్రశ్నించారు. తన ప్రభుత్వం ఏవిధంగా వ్యవస్థలపై దాడిచేస్తుందో జగనే ప్రజలకు చెప్పాలన్నారు. రాజ్యాంగహోదాలో, పదవుల్లో ఉన్నవారు కూడా రాజ్యాంగ వ్యవస్థలను కించపరచడం దుర్మార్గమన్నారు. 

స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచీ రాజ్యాంగవ్యవస్థలపై ఎన్నడూ లేనివిధంగా జగన్ ప్రభుత్వం దాడిచేస్తోందన్నారు. సోషల్ మీడియాలో వైసీపీకి సంబంధించిన వ్యక్తులు పెడుతున్న పోస్టింగులు చూసి ప్రజలు నివ్వెరపోతున్నారని, ఈవీఎమ్ ల పుణ్యమా అని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రాజ్యాంగ, న్యాయ వ్యవస్థలను లెక్కచేయకుండా, ప్రజాస్వామ్యంలోని నాలుగు స్తంభాలపై దాడి చేస్తున్నాడని దేవినేని తూర్పారపట్టారు.

ప్రభుత్వం తన అసమర్థతను, చేతగాని తనాన్ని కప్పి పుచ్చుకునేందుకే టీడీపీపై దాడి చేస్తోందన్నారు. ప్రభుత్వానికి శాసనసభ అన్నా, కార్యనిర్వాహక వ్యవస్థ అన్నా గౌరవం లేదని, డీజీపీ మూడుసార్లు, చీఫ్ సెక్రటరీ రెండుసార్లు హైకోర్టుకి వెళ్లొచ్చినా మార్పు లేదన్నారు. 

టీవీ.5 మూర్తిని విచారణ పేరుతో రాత్రి పదివరకు విజయవాడ సీఐడీ కార్యాలయంలో ఉంచుతున్నారని, టీవీ.5 యాజమాన్యానికి చెందిన నాయుడిని కూడా అలానే వేధిస్తున్నారన్నారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఈటీవీ. టీవీ.5, ఏబీఎన్ ప్రసారం కావడంలేదని, మంత్రులే స్వయంగా కేబులు ఆపరేటర్లను బెదిరించీ మరీ ఛానళ్ల ను నిలిపివేయించారన్నారు.

ప్రజాస్వామ్యంలో నియంతలకు కాలంచెల్లిందన్నారు. తమ పార్టీ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయించడం కోసం, తన పార్టీకి చెందిన వారే ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తున్నారంటే, దాన్ని దేవుడి స్క్రిప్ట్ కాక ఏమనాలో చెప్పాలని దేవినేని ఎద్దేవాచేశారు.

నర్సాపూర్ ఎక్స్ ప్రెస్, సింహపురి ఎక్స్ ప్రెస్ తో పాటు, ఢిల్లీ వెళ్లిన ప్రత్యేకవిమానం పుణ్యమా అని మీ పాపాలు బద్దలయ్యే రోజు దగ్గర్లోనే ఉందని ఉమా స్పష్టంచేశారు. చంద్రబాబు నాయుడి పిలుపుతో 13 జిల్లాల్లోని టీడీపీ కార్యకర్తలు, నేతలు, ఉదయం 10 నుంచి సాయంత్రం 5వరకు రాజధాని ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనాలని దేవినేని సూచించారు.