గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , గురువారం, 2 సెప్టెంబరు 2021 (16:00 IST)

దిశ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాలు చేయడం బాధాకరం...

మహిళ భద్రత కోసం చిత్తశుద్ధితో దిశ చట్టాన్ని తీసుకొచ్చామ‌ని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. దిశా చట్టం రాష్ట్రపతి అనుమతి పొందే సమయానికల్లా చట్టాన్ని అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామ‌న్నారు. కొంతమంది దిశ పోలీస్ స్టేషన్ల వద్ద ఆందోళన చేస్తున్నార‌ని, ఇది చాలా  బాధాకరం అన్నారు.
 
అనేక మంది మహిళలు దిశ యాప్ ద్వారా రక్షణ పొందుతున్నార‌ని, గతం ప్రభుత్వంలో మహిళా తహశీల్దార్ పై ఎమ్మెల్యే దాడి చేసినా పట్టించుకోలేద‌ని సుచ‌రిత చెప్పారు. టిడిపి శ్రేణులు దిశ చట్టాన్ని  అవహేళన చేసేందుకు ప్రయత్నిస్తున్నార‌ని, మహిళలపై ఏదైనా ఘటన జరిగితే ఏడు రోజుల్లోనే ఛార్జ్ షీట్ వేస్తున్నామ‌ని, దాదాపు 1500 కేసుల్లో 7 రోజుల్లోనే ఛార్జిషీటు వేశామ‌ని మంత్రి తెలిపారు.
 
దిశా చట్టం అమల్లోకి రాలేదు, కానీ ఆ చట్టం స్పూర్తితో ఇప్పటికే పని చేస్తున్నామ‌ని, మహిళల రక్షణ కోసం ప్రతిపక్ష పార్టీలు సలహాలిస్తే తప్పకుండా స్వీకరిస్తామ‌ని చెప్పారు. రాష్ట్రపతి ఆమోద ముద్రపడిన వెంటనే చట్టాన్ని అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామ‌ని, ఈ లోగా దిశ చట్టాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకోవద్ద‌ని సూచించారు. ఏదైనా ఘటన జరగగానే దాన్ని మానవతా దృక్పథంతో చూడకుండా కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నార‌ని, మహిళల రక్షణ కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంద‌ని హోం మంత్రి వివ‌రించారు..