సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 జూన్ 2022 (11:13 IST)

పేద ముస్లిం యువతులకు లక్ష ఆర్థిక సాయం.. దుల్హన్ పథకం అమలవుతుందా?

ys jagan
ఏపీ ప్రభుత్వంపై పేద ముస్లిం యువతులకు లక్ష రూపాయల ఆర్ధిక సాయం అందించే దుల్హన్ పథకం విషయంలో ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. హైకోర్టులో విచారణ సందర్భంగా నిధులు లేనందున పథకాన్ని నిలిపేశామని ప్రభుత్వం చెప్పడంతో ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి.  
 
ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించారు. భేటీ ముగిసిన తర్వాత పలువురు మంత్రులు దుల్హన్ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. అన్ని వివరాలు సేకరించి బడ్జెట్ ఎంతవుతుందో అంచనా వేసిన తర్వాత పథకాన్ని ప్రారంభిద్దామని సీఎం అన్నట్లు తెలుస్తోంది.
 
అంతేకాదు చర్చ సందర్భంగా జగన్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. గత ప్రభుత్వ 2017, 18లోనే నిలిపేసిందని.. వేలాది మందికి డబ్బులు విడుదల చేయకుండా పెండింగ్‌లో పెట్టారన్నారు. ఆ బకాయిలన్నీ చెల్లించి కొత్తగా మళ్లీ ప్రారంభించాలంటే నిధులుండాలన్నారు.
 
అందుకే గత ప్రభుత్వ బకాయిలతో పాటు కొత్తగా పథకాన్ని ప్రారంభించడానికి అవసరమైన నిధులన్నీ అంచనాలు సిద్ధమయ్యాక పథకాన్ని ప్రారంభిద్దామని జగన్ అన్నట్లు సమాచారం. దీంతో త్వరలోనే దుల్బన్ పథకానికి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశముంది.
 
ఇదిలా ఉంటే దుల్హన్ పథకాన్ని ప్రభుత్వం నిలిపేసిందంటూ కోర్టులో పిటిషన్ దాఖలవగా.. ప్రభుత్వం స్పందించింది. కోర్టు ఆదేశాల మేరకు పథకానికి సంబంధించి అఫిడవిట్ దాఖలు చేసింది. నిధుల లేమి కారణంగానే పథకాన్ని నిలిపేయాల్సి వచ్చిందని పేర్కొంది. దీంతో ప్రభుత్వం ఇచ్చిన సమాధానం రాజకీయంగా వివాదాస్పదమైంది.
 
ఇకపోతే ఏపీ సర్కారు ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఐతే కొన్ని పథకాల విషయంలో విమర్శలెదుర్కొంటోంది. అమ్మఒడి, రైతు భరోసా, కాపు నేస్తం, వైఎస్ఆర్ చేయూత, ఆసరా వంటి పథకాలను అమలు చేస్తున్నా గతంలో అమలు చేసిన పెళ్లికానుక పథకాన్ని మాత్రం పెద్దగా పట్టించుకోలేదు.
 
గత ప్రభుత్వం చంద్రన్న పెళ్లికానుక పేరుతో వివిధ వర్గాలకు చెందిన పేద యువతులకు పెళ్లి సమయంలో రూ.50వేలు కానుక అందజేసేది. ఐతే ఎన్నికల ప్రచారంతో పాటు సీఎం అయిన తర్వాత కూడా వైఎస్ఆర్ పెళ్లికానుక పేరుతో రూ.లక్ష ఇస్తామని జగన్ ప్రకటించినా అది కార్యరూపం దాల్చలేదు.