ఇ-రైతు డిజిటల్ మార్కెట్ నెట్‌వర్క్ ప్రారంభించిన సీఎం... ఇక రైతులకు అద్భుతాలే...

అమరావతి: సమాచార సాంకేతికత విప్లవం ఊతంతో ఎన్నో అద్భుతాలు చేయవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఉండవల్లి ప్రజావేదికపైన బుధవారం సాయంత్రం మాస్టర్ కార్డ్ రూపొందించిన ఇ-రైతు డిజిటల్ మార్కెట్ నెట్‌

babu
chj| Last Updated: గురువారం, 13 సెప్టెంబరు 2018 (16:40 IST)
అమరావతి: సమాచార సాంకేతికత విప్లవం ఊతంతో ఎన్నో అద్భుతాలు చేయవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఉండవల్లి ప్రజావేదికపైన బుధవారం సాయంత్రం మాస్టర్ కార్డ్ రూపొందించిన ఇ-రైతు డిజిటల్ మార్కెట్ నెట్‌వర్క్‌ను ఆయన ప్రారంభించారు. ఇ-రైతు డిజిటల్ మార్కెట్ నెట్‌వర్క్‌ లింక్ కోసం మాస్టర్ కార్డు వారు ప్రత్యేకంగా క్యూ ఆర్ కోడ్‌ను రూపొందించారు. ఆంధ్రప్రదేశ్‌లో రైతాంగ సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి, మాస్టర్ కార్డ్ సంస్థకు మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా మాస్టర్ కార్డ్ సంస్థ. ‘ఇ-రైతు’ పేరుతో ఫార్మర్ నెట్‌వర్క్ ప్రారంభిస్తోంది. 
 
డిజిటల్ మార్కెట్ నెట్‌వర్క్ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన బ్రోచర్‌ను సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ రంగంలో సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకుంటున్నామని చెప్పారు. ఈ స్థాయిలో ఐటీ, ఐవోటీలను ఉపయోగించుకుంటున్న ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేదన్నారు. భూగర్భ జలాల నుంచి పిడుగులు పడే సమాచార వరకు రియల్‌ టైమ్‌లో పొందుపరిచే వ్యవస్థల్ని మనం ఏర్పరచుకున్నామని చెప్పారు. జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయాన్ని పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. సహజసిద్ధ సేద్యపు విధానాలు కచ్చితంగా అనుసరించాల్సిన పరిస్థితులు ఇప్పుడున్నాయన్నారు.  
 
మనం తినే తిండిలో సగానికిపైగా రసాయనాలు వుంటున్నాయని చెప్పారు. తినే తిండి, పీల్చేగాలి, ఉండే వాతావరణం పూర్తిగా కలుషితం అయిపోతుండటం ఆందోళనకలిగిస్తోందన్నారు. ఈ పరిస్థితిని గమనించి మనం ముందే మేల్కొన్నామని చెప్పారు.  ప్రకృతి సహజ వ్యవసాయానికి వెళ్లామని, విద్యుత్ ఉత్పత్తిలో సంప్రదాయేతర వనరులను ఆశ్రయిస్తున్నామని, సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిని పెద్దఎత్తున చేపట్టామని వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్ మన రాష్ట్రంలో నెలకొల్పుతున్నట్లు తెలిపారు. 
 
ఇ-రైతు డిజిటల్ నెట్‌వర్క్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేయడం ఒక విప్లవంగా పేర్కొన్నారు. మాస్టర్ కార్డ్ నిర్వాహకులు ఎప్పుడు కలిసినా రైతాంగానికి ప్రయోజనకారిగా వుండే సాంకేతికతను తీసుకురావాలని కోరేవాడినని చెప్పారు. ఆర్థిక సాంకేతిక రంగంలో వారు ఉద్ధండులని కితాబిచ్చారు. రైతులకు ఉపయోగపడే డిజిటల్ వేదికను వారు పరిచయం చేస్తుండటం గర్వకారణంగా ఉందన్నారు. ఈ విధానం మొట్టమొదట ఏపీలోనే ప్రారంభం కావడం మరీ విశేషంగా పేర్కొన్నారు. 
 
సాగు వివరాలు, ఉత్పత్తుల వివరాలను ‘ఇ-రైతు’ డిజిటల్ మార్కెట్ ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా విక్రయంచుకునే అవకాశం రైతులకు దక్కుతుందని చెప్పారు. రైతులకు మార్గదర్శిగా, సలహాలిచ్చే స్నేహితునిగా ‘ఇ-రైతు’ వుంటుందన్నారు. వ్యవసాయదారులకు ప్రపంచ మార్కెటింగ్ సదుపాయాలను కల్పిస్తూ వారికి రెట్టింపు ఆదాయాన్ని అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేరుస్తుందని చెప్పారు. ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లతో రాష్ట్ర వ్యవసాయ రంగంలో పెనుమార్పులు తీసుకొస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఆహార భద్రత కల్పించాలంటే రాష్ట్రంలో వ్యవసాయం సమృద్దిగా వుండాలన్నారు.  
 
రైతులు రెట్టింపు ఆదాయంతో సంతృప్తితో జీవించాలన్నారు. అందుకే వ్యవసాయానికి అనుబంధంగా వున్న పాడి, మత్స్య, పశు పోషక రంగాలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు.  మరోపక్క ఆహార శుద్ధి పరిశ్రమలకు ఊతం ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఎకరా భూమిని సాగునీటితో తడపాలన్నదే ప్రభుత్వ సంకల్పంగా పేర్కొన్నారు. ఇ-మార్కెట్లదే ప్రస్తుతం హవా అన్నారు.  అలీబాబా, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఊబర్ విజయగాధలు మరెందరో ఔత్సాహిక పారిశ్రామికులకు స్ఫూర్తినిస్తున్నాయన్నారు.
 
‘ఇ-రైతు’ను మాస్టర్ కార్డ్ సంస్థ వ్యాపారం కోసం ప్రవేశపెట్టలేదని, రైతాంగం పట్ల శ్రద్ధ, వ్యవసాయం పట్ల ప్రేమతో ఈ ప్లాట్‌ఫామ్ తీసుకొచ్చారన్నారు. ప్రవాసులు ఎక్కడ వున్నా సొంత నేల రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. జన్మభూమిపై వున్న సొంత మనుషులకు ఏదైనా చేయాలన్న తపనతో ముందుకురావాలన్నారు. ‘ఇ-రైతు’ తరహా వినూత్న ప్రయోగాలకు సిద్ధం కావాలని, అలా ముందుకొచ్చే యువతకు స్టార్టప్స్ ఏర్పాటులో సహకరిస్తామని చెప్పారు. ప్రకృతి సేద్యంలో ఏపీ అగ్రగామిగా ఉందని, రానున్న కాలంలో 2 కోట్ల ఎకరాలలో ప్రకృతి సేద్యానికి వెళుతున్నామని సీఎం చెప్పారు. 
 
వ్యవసాయ శాఖ మంత్రి  సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతు తన పొలం నుంచే పంటలను నేరుగా ప్రపంచంలో ఎక్కడైనా విక్రయించుకునే అవకాశాన్ని ‘ఇ-రైతు’ ప్లాట్‌ ఫామ్ కల్పిస్తుందన్నారు. దేశంలోనే ఈ తరహా విధానం ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెడుతున్నామని చెప్పారు. నిరంతరం రైతుల శ్రేయస్సు కోసం ఆలోచించే ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ కార్డ్ సౌత్ ఆసియా మార్కెట్ డెవలప్ మెంట్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ కుమార్, వ్యూహాత్మక వృద్ధి వైస్ ప్రసిడెంట్ ఆంటోనియా స్ట్రోహ్, ల్యాబ్ వైస్ ప్రసిడెంట్ సలా గోస్, రాష్ట్ర గిడ్డండుల సంస్థ చైర్మన్ ఎల్‌విఎస్‌ఆర్‌కే ప్రసాద్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ముఖ్యమంత్రి కార్యదర్శి ఎవి రాజమౌళి, ఉద్యానశాఖ కార్యదర్శి చిరంజీవి చౌదరి, సమాచార శాఖ కార్యదర్శి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.దీనిపై మరింత చదవండి :