శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 ఆగస్టు 2020 (15:47 IST)

మావోయిస్టుల్లో చేరుతా పరువు కాపాడుకుంటా.. అనుమతించండి.. : దళిత యువకుడు

ఇటీవల తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్‌లో ఇడుగుమిల్లి ప్రసాద్ అనే ఓ దళిత యువకుడికి పోలీసులు శిరోమండనం చేశారు. స్థానిక వైకాపా నేత ఒత్తిడి మేరకు పోలీసులు దగ్గరుండిమరీ ఈ పని చేయించారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో చాలా సీరియస్ అయింది. దీంతో ఈ వికృత చర్యకు పాల్పడిన పోలీసులపై శాఖాపరమైన చర్యలను ఏపీ పోలీస్ శాఖ తీసుకుంది. 
 
ఈ క్రమంలో తనకు న్యాయం జరగలేదనీ, అందువల్ల మావోయిస్టుల్లో చేరి నా పరువు నేనే కాపాడుకుంటా అంటూ ఆ దళిత యువకుడు వాపోతున్నాడు. ఈ మేరకు రాష్ట్రపతి గ్రీవెన్స్‌ సెల్‌కు ఓ లేఖ రాశారు. గతనెల 18న సీతానగరం పోలీసుస్టేషన్‌లో వైసీపీ ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు తనకు ఎస్‌ఐ శిరోముండనం చేశారని, హింసించారని అందులో వివరించారు. ఈ లేఖ రాష్ట్రపతి సెక్రటేరియట్‌కు చేరిందని, పరిశీలనలో ఉందని స్టేట్‌స్‌లో తెలపడం విశేషం.
 
ఈ లేఖలో 'నేను చాలా పేదకుటుంబానికి చెందిన వాడిని. అక్రమ మైనింగ్‌ను ప్రశ్నించడమే నేను చేసిన తప్పు అయినట్లుంది. 22వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ కూడా శిరోముండనాన్ని సీరియ్‌స్‌గా భావిస్తున్నట్టు ట్వీట్‌ చేశారు. ఈ విషయంలో ఏడుగురి మీద ఎఫ్‌ఐఆర్‌ నమోదు వేశారు. అందులో 6వ ముద్దాయి ఇసుక మాఫియాకు చెందిన వ్యక్తికాగా, 7వ ముద్దాయి పోలీసు ఆఫీసర్‌. అతడు సస్పెండ్‌ అయ్యాడు. అంతేకాదు ఎస్‌ఐని అరెస్ట్‌ చేసి, జైలుకు పంపారు. 
 
కానీ 1 నుంచి 6 వరకూ ఉన్న ముద్దాయిలను మాత్రం ఇంతవరకూ అరెస్టు చేయలేదు. వీరే ప్రధాన కారకులు. ఇక్కడ ఎస్‌ఐ కేవలం ఉద్యోగంలో చేరి 48 గంటలు అయింది. ఆయనకూ, నాకూ వ్యక్తిగత గొడవలు ఏమీ లేవు. శిరోముండనం విషయాన్ని జిల్లా కలెక్టర్‌, రాజమహేంద్రవరం ఎస్‌పీ కూడా పట్టించుకోవడంలేదు. ముద్దాయిలను అరెస్ట్‌ చేయలేదు. నాకు ఏవిధమైన సహాయమూ చేయలేదు. నేను దళితుడిని కావడం వల్లే న్యాయం జరగడంలేదు. నేను పరువు కాపాడుకుంటాను... దయవుంచి నక్సల్స్‌లో చేరడానికి నాకు అనుమతి ఇవ్వండి. ఇక్కడ శాంతిభద్రతలు విఫలమయ్యాయి' అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ ఇపుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది.