బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శనివారం, 6 నవంబరు 2021 (20:47 IST)

దేశాభివృద్దిలో విద్యదే కీలక భూమిక: ఏపీ గవర్నర్

దేశాభివృద్ధిలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని, విద్య ఒక దేశానికి వెన్నెముకగా ఉంటిదని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరించందన్ అన్నారు.  విద్యాసంస్థలు ఉత్పత్తి చేసే మానవ వనరులు దేశ పురోగతిలో అత్యంత నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయన్నారు.

మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయం ఐదవ స్నాతకోత్సవానికి కులపతి హోదాలో గవర్నర్ హాజరయ్యారు. విజయవాడ రాజ్ భవన్ నుండి వెబినార్ విధానంలో గవర్నర్ ప్రసంగించారు. విద్యార్జన నాగరికతకు చిహ్నమని, దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంకేతిక సంస్కరణలు తీసుకొచ్చేందుకు ఉన్నత విద్య ఒక ముఖ్యమైన సాధనంగా పరిగణించబడుతుందని పేర్కొన్నారు.

ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యను అందించడం ద్వారా నిపుణులను తీర్చిదిద్దడం ఉన్నత విద్యా సంస్థల ముఖ్యమైన లక్ష్యం కావాలని, నాణ్యత విషయంలో రాజీ పడరాదని స్పష్టం చేసారు. కరోనా వల్ల డిజిటల్ టెక్నాలజీలను ప్రత్యామ్నాయ బోధనా వ్యవస్థగా స్వీకరించవలసిన పరస్ధితి ఏర్పడిందని ఈ క్రమంలో ఎదురవుతున్న సవాళ్లను అధికమించాలని సూచించారు.

ముఫై నాలుగేళ్ల విద్యా వ్యవస్థలో జాతీయ విద్యా విధానం 2020 అతి పెద్ద సంస్కరణ కాగా. ఆ ఫలాలను అందిపుచ్చుకోనున్న ఈ తరం విద్యార్థులు నిజంగా అదృష్ట వంతులన్నారు. ప్రధాన మంత్రి నాయకత్వంలో భారతదేశం ప్రపంచ స్థాయి 'ఎడ్యుకేషనల్ హబ్'గా రూపుదిద్దుకోనుందన్నారు.

మౌలిక సదుపాయాల సమస్యలను అధిగమించి విశ్వవిద్యాలయం రుద్రవరంలోని స్వంత క్యాంపస్ నుండి పనిచేయడం శుభపరిణామమన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం 2020-21 విద్యా సంవత్సరంలో ISO 9001:2015 - క్వాలిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ సర్టిఫికేషన్‌ను పొందడం,  ప్రస్తుత విద్యా సంవత్సరంలో న్యాక్ అక్రిడిటేషన్‌ను సాధించేందుకు సన్నాహాలు చేయడం హర్షణీయమని గవర్నర్ పేర్కొన్నారు.

విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హజరైన భారత ప్రభుత్వ రక్షణ పరిశోధన, అభివృద్ధి శాఖ కార్యదర్శి డాక్టర్ జి. సతీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ పోటీకి అనుగుణంగా భారతీయ విద్యార్ధులు సిద్దం కావాలన్నారు. కార్యక్రమంలో భాగంగా పద్మశ్రీ పురస్కార గ్రహీత అచార్య ఎన్. బాలకృష్ణన్ కు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసారు. 

నాగార్జునా విశ్వవిద్యాలయం ఉపకులపతి అచార్య కె.బి.చంద్రశేఖర్, రిజిస్ట్రార్ అచార్య రామిరెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొనగా, విజయవాడ రాజ్ భవన్ నుండి గవర్నర్ వారి సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్, కృష్ణా విశ్వ విద్యాలయం జర్నలిజం శాఖ అధిపతి డాక్టర్ జ్యోతిర్మయి, డాక్టర్ సురేష్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.