శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 అక్టోబరు 2020 (15:48 IST)

ఏపీలో 2 నుంచి స్కూల్స్ రీఓపెన్... షెడ్యూల్ ఇదే...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలు, కాలేజీలు వచ్చే నెల రెండో తేదీ నుంచి పునఃప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఏపీ సర్కారు సర్క్యులర్ జారీ చేసింది. అలాగే, కోవిడ్ నేపథ్యంలో స్కూల్స్ రీఓపెన్‌కు సంబంధించి షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. 
 
కరోనా మహమ్మారి కారణంగా స్కూల్స్, కాలేజీలు సుధీర్ఘంగా మూసివేసివున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో స్కూళ్ల‌ను ద‌శ‌ల‌వారీగా తెరిచేలా ఏపీ సర్కారు ప్లాన్ చేసింది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. న‌వంబ‌ర్ రెండ‌వ తేదీ నుంచి అన్ని ప్ర‌భుత్వ విద్యా సంస్థ‌ల‌ను తెర‌వ‌నున్నారు. 
 
క‌ఠిన కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ బ‌డుల‌ను తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు దశల్లో పాఠశాలల్లో తరగతులను నిర్వహిస్తారు. న‌వంబ‌ర్ 2వ తేదీ నుంచి 9, 10, 11, 12 త‌ర‌గ‌తుల‌కు రోజు త‌ప్పించి రోజు ఒంటిపూట బడులను నిర్వహిస్తారు. 
 
ఇక 6, 7, 8వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు కూడా హాఫ్ డే స్కూళ్ల‌ను స్టార్ట్ చేస్తున్నారు. న‌వంబ‌ర్ 23వ తేదీ నుంచి రోజు విడిచి రోజు ఈ క్లాసులు జ‌ర‌గ‌నున్నాయి. ఇక ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి అయిదో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు కూడా డిసెంబ‌ర్ 14వ తేదీ నుంచి ప్ర‌త్యామ్నాయ దినాల్లో స్కూళ్ల‌ను నిర్వ‌హించ‌నున్నారు.